ఏపీ మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. వేగంగా వాహనం నడపమే ప్రమాదానికి కారణమని చెప్పారు. నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపేందుకు ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. ఇప్పటికీ, సంతాప సందేశాలు పంపుతూనే ఉన్నారు. మంత్రికి వచ్చిన కష్టంపై పార్టీలకు అతీతంగా నాయకులందరూ స్పందిస్తారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపి… ఆ తరువాత మీడియా ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే, జేసీ మాట్లాడితే ఏదో కాంట్రోవర్సీ ఉంటుందని అనుకుంటాం! కానీ, ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
సమాజంలో డబ్బున్నవారి బిడ్డలకు క్రమశిక్షణ లేకుండా పోతోందని జేసీ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదనలో పడిపోయి పిల్లలకు సమయం కేటాయించడం లేదన్నారు. హైసోసైటీలో పిల్లల ప్రవర్తన దారుణంగా ఉంటోందని, ఎవరిమాటనూ లెక్కచేయకుండా పిల్లలు ఎదుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రాత్రి 11 దాటగానే పబ్బులు, బారులూ మూతపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సంపాదన అంతా పిల్లల కోసమే అంటూ, వారితో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించకపోతే ఎలా అంటూ జేసీ ప్రశ్నించారు. తాను ఎవరినీ తప్పుబట్టాలనే ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం లేదనీ, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల గర్భశోకం చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆయన అన్నారు.
సందర్భం ఏదైనా సరే, జేసీ నాలుగు మంచి మాటలే చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటితే బడాబాబుల బేటాల వీర విహారాలు వింటూనే ఉన్నాం. పోలీసులు వారిని పట్టుకుని, కౌన్సెలింగ్ చేసి వదిలేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఏదైనా భారీ ప్రమాదం జరిగితే… అక్కడి నుంచి కొన్నాళ్లపాటు కఠిన చర్యలు, నిబంధనలూ అంటూ కాస్త హడావుడి ఉంటుంది. ఆ ఘటన గురించి అందరూ మరచిపోగానే పరిస్థితి షరా మామూలే. వాహనాలను మితిమీరిన వేగంతో నడిపేవారికి కఠిన శిక్షలు లేవు. జరిమానాలతో మాత్రమే సరిపెట్టేస్తున్నారు.
ఆ విషయాన్ని పక్కనపెడితే.. జేసీ చెప్పినట్టుగా హై సొసైటీ తల్లిదండ్రులలో మార్పు అవసరం. పిల్లలను బాగా చూసుకోవడం అంటే, ఖరీదైన కార్లూ సెల్ ఫోన్లూ కొనివ్వడం ఒక్కటే కాదు కదా! వారితో మాట్లాడేందుకు టైమ్ ఇవ్వాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో, భవిష్యత్తును ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలో… ఇలాంటి విషయాలను తరచూ చర్చిస్తుండాలి. ‘పిల్లలు కదండీ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు’ అనుకుంటే కరెక్ట్ కాదు. వినోదానికీ విచ్చలవిడితనానికీ మధ్య తేడా తెలియజెప్పనంత కాలం.. ఇలాంటి ప్రమాదాల గురించి అడపాదడపా వినాల్సి వస్తూనే ఉంటుంది.