కాసేపు, ఆయనేమో యాక్టివ్ పాలిటిక్స్ లో లేనంటారు. కానీ, ఇతర పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తుంటాయంటారు. ఆయనేనండీ.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఇప్పుడు తాను పార్టీలకు అతీతంగా ఉన్నానని మరోసారి మీడియా ముందుకు వచ్చి చెప్పారు. రెండ్రోజుల కిందటే జేసీ సోదరుడు టీడీపీని ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేశారు కదా, ఆ పార్టీని భాజపాలో విలీనం చేసేయాలంటూ అన్నారు కదా! ఈ నేపథ్యంలో ఈయనేమైనా స్పందిస్తారేమో అని మీడియా ఆయన్ని కలిస్తే… భాజపా నాయకులు తనతో ఇప్పటికీ టచ్ లో ఉన్నారన్నారు. అమిత్ షా తరువాతి స్థాయిలో ఉన్న కొందరు తనతో మాట్లాడారని చెప్పారు. చాలామంది వారి ప్రయత్నాలు వారు చేస్తూ మాట్లాడుతున్నారనీ… కానీ, నా నిర్ణయం నాకు ఉండాలి కదా అన్నారు.
వైకాపా పాలన మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలపై కచ్చితంగా మాట్లాడుతున్నారనీ, అన్నీ ఆచరించాలని అంటున్నారన్నారు. కానీ, గ్రౌండ్ కి వచ్చేసరికి పరిస్థితి అట్ట లేదు అన్నారు జేసీ. కొంతమంది పెద్దలు ఆవురావురుమంటూ ఉన్నారన్నారు. ఇప్పుటికే నెలైపోయిందని తట్టుకోలేకుండా ఉన్నారనీ, ఈ నెలలో ఏమొచ్చిందని లెక్కాచారాలు చూసుకుంటున్నారని జేసీ వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా కావాలని ఎదురుచూస్తున్నారన్నారు!! వీళ్లని జగన్ ఎలా నిపుదల చేస్తారో చూడాలన్నారు. ఇలాంటి పెద్దల గురించి జగన్ దృష్టికి వచ్చిందా, వచ్చినా పట్టించుకోకుండా ఉంటున్నారా అనేది తేలాల్సి ఉందన్నారు. జగన్ చాలా ఉత్సాహంగా ఉన్నారనీ, అందుకే కొంత సమయం ఇవ్వాలనీ, ఈలోగా అనవసరంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులకు తాను చెప్తున్నా అన్నారు.
అవినీతి ఎక్కడున్నా సహించేది లేదని ముఖ్యమంత్రి అంటుంటే, అవకాశం కోసం కొంతమంది ఎదురుచూస్తున్నారంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు కాస్త సీనియర్ గానే ఉన్నాయి. అయితే, వీటిపై వైకాపా నేతలు స్పందిస్తారా, ఎందుకు అనవసర ప్రాధాన్యత కల్పించడమని ఊరుకుంటారా చూడాలి. ఏదైతేనేం, భాజపా నేతలు ఇప్పటికీ ఆయనతో టచ్ లో ఉన్నారనే చెబుతున్నారు. మరీ.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ టచ్ లో ఉన్న నేతలకు అదే మాట చెప్పుంటే… వాళ్లు టచ్ లోకి పదేపదే వచ్చే పని తప్పుతుంది కదా!2