మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫైర్ మీద ఉన్నారు. తన కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్స్ లీజులను సర్కార్ రద్దు చేయడంతో.. ఆయన అమరావతిలో దిగిపోయారు. రాజధాని రైతులకు సంఘిభావం తెలిపారు. అలాగే మీడియాతో మాట్లాడారు. ప్రతీ చోటా…జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే.. ఆయనను ముక్కలుగా చేసేయాలని.. కానీ రాజధాని రైతులపై కక్ష సాధించడం ఏమిటని.. ఓ చోట జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ తాత రాజారెడ్డికి అడ్డొచ్చిన వాళ్లని పైకి పంపడం తెలుసని.. జగన్ మాత్రం అందర్ని ఒకేసారి పైకి పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
సీఎం పీఠం కోసం ఎదురుచూసి ఇప్పడు కక్ష సాధిస్తున్నాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ.. సామాజికవర్గపై కక్ష కోణంలోనే ఉన్నాయి.. జేసీ విశ్లేషించారు. మీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడు .. మీకు జరిగిన నష్టంతో పోలిస్తే నాకు జరిగింది చిన్నదని అమరావతి రైతులతో వ్యాఖ్యానించారు. తనకు 124 బస్సులు ఉంటే 84 బస్సులు మూసేశాడని గుర్తు చేశారు. అమరావతి ప్రాంతం కమ్మవాళ్ల డామినేషన్ ఉండటమే ఈ ప్రాంత ప్రజల పాపమన్నారు. జగన్కు బాగా కుల పిచ్చి పట్టుకుంది అందుకే ఇదంతా జరుగుతోందన్నారు. కమ్మ జాతిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని ..కృష్ణా, గోదావరిలో కలిపారని జేసీ విశ్లేషించారు.
కులాల పిచ్చి పట్టి వీడు చరిత్ర హీనుడు అవుతున్నాడని ఘాటుగా మండిపడ్డారు. మా వాడికి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రభువును వేడుకుంటున్నాని చెప్పుకొచ్చారు. త్రిశూల్ సిమెంట్స్ లీజు ఉత్తర్వులు వచ్చినప్పటి నుండి జేసీ ఆవేశంలో ఉన్నారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సహజసిద్ధమైన ఆవేశంలోఆయన జగన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.