” తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని” మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం.. తమను అవమానించారంటూ.. పోలీసులే నమోదు చేసిన కేసులో.. స్టేషన్ బెయిల్ కోసం అన్ని పత్రాలతో వెళ్లిన జేసీ దివాక్ర రెడ్డిని… ఎనిమిది గంటల పాటు.. స్టేషన్లోనే ఉంచేశారు పోలీసులు. లేని పోని వివాదాలెందుకని.. కేసు నమోదు చేశారని తెలుసుకుని స్టేషన్ బెయిల్ పత్రాలు తీసుకుని తానే వెళ్లాలని పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను.. అవమానించేందుకు ఎనిమిది గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారని.. జేసీ ఆరోపిస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తీవరంగా ఒత్తిడికి గురవుతున్న వారిలో అనంతపురం జిల్లాకు జేసీ కుటుంబం ఒకటి. వారి వ్యాపారాలనే కాదు.. వారి రాజకీయ భవిష్యత్‌ను కూడా.. జగన్ దారుణంగా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
వారి బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేయడమే కాదు.. సీనియర్ జేసీని నిన్న పోలీసులు ఎనిమిది గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. దీంతో.. తాడిపత్రిలో ఓ రకమైన అలజడి రేగింది. సాయంత్రానికి వదిలి పెట్టకపోతే ఏమైనా జరుగుతుందేమో అనుకున్నదశలో పోలీసులు ఆయనను వదిలి పెట్టారు. దీనిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా అధికార కేంద్రానికి దాసోహమయ్యారు.. ఓ రిమోట్ కంట్రోల్ శక్తి వారిని నడిపిస్తోందన్నారు. కోర్టులను.. చట్టాలను జగన్ సర్కార్ పాటించడం లేదన్నారు.
మొత్తానికి జేసీ కుటుంబం.. తమ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంతటి.. ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బస్సులను సీజ్ చేసేశారు. కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటే..మళ్లీ సీజ్ చేసేశారు. ఇతర వ్యాపారాలపైనా గురి పెట్టారు. తమను టార్గెట్ చేశారని..జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు మీడియా ముందు వాపోయినా.. ఎలాంటి పరిస్థితి మారడం లేదు. దీంతో.. జేసీ బ్రదర్స్ పగతో రగిలిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.