అసెంబ్లీ సమావేశాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమైనా తొలి రోజు అక్కడ తన హాజరు చూపించి ఏవో కొన్ని వ్యాఖ్యలు చేయకపోతే జేసీ దివాకర్ రెడ్డికి మనసు ఊరుకోదు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకావడంతో తొలి రోజే ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. ఎం మాట్లాడారో కానీ తాము తెలంగాణను విడిచిపెట్టి తప్పు చేశామని బాధపడ్డారు. ఉద్యమం సమయంలోనే రాయల తెలంగాణ కావాలనికోరుకున్నామని కానీ జైపాల్ రెడ్డి పడనీయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఏమీ బాగోలేవని.. తెలంగాణలో మాత్రం బాగున్నాయని చెప్పుకొచ్చారు.
గతంలో అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చి నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఓడిపోతారని ప్రకటించారు. ఈ విషయంపై మీడియాలో విస్తృత చర్చ జరగింది. హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో కాంగ్రెస్ నేతలు జేసీతో మాట్లాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపించలేదు. సీఎల్పీకి వచ్చి కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మాట్లాడకూడదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించడంతో ఆయనకు సారీ చెప్పారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని ..కానీ హుజురాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.
జేసీ దివాకర్ రెడ్డి తాము తెలంగాణకు వస్తామని చెప్పడం అంటే రాజకీయంగా ఇక్కడకు వస్తామని చెప్పడమే కానీ అలాంటి పరిస్థితే లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జేసీ నాన్ సీరియస్ కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్‌తో సమావేశం కావడంతో రాజకీయ గుట్టు ఏదో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.