టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరు అందరికీ తెలిసిందే. ఆయనకు ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎందుకు అనుగ్రహం కలుగుతుందో చెప్పడం కష్టం. తాజాగా మరోసారి ఆయనకి ఆగ్రహం వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీ వైకాపాకి సవాల్ విసురుతున్నారు. తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అంతేకాదు, తనతోపాటు రాజీనామాలు చేసేందుకు వైకాపా ఎంపీలు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ చేశారు. ప్రజల్లోకి వెళ్దామనీ, అక్కడే తేల్చుకుందామని అంటున్నారు. వైకాపా నుంచి ముందుగా విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ట్రిపుల్ తలాక్ చెప్పేశామనీ, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఏ ఫ్రెంట్ల వైపు చూడాల్సిన అవసరం తమకు లేదనీ, ప్రజల్లోకి వెళ్తామని అన్నారు.
నిన్న కూడా ఇలానే సవాళ్లు చేస్తూ తొడలు కొడుతూ కొంత హడావుడి చేశారు. పార్లమెంటు ఆవరణలో వైకాపా ఎంపీలు ధర్నా చేస్తుంటే.. అక్కడికి జేసీ వెళ్లారు. ఓ పక్క జాతీయ మీడియా ఫోకస్ అంతా అక్కడే ఉన్నా, దాన్ని పట్టించుకోకుండా ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఇలానే సవాల్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్, ప్రజల్లోకి వెళ్తాం. ఎవరి సత్తా ఏంటో ప్రజల్లోనే తేల్చుకుందాం, ఎవరు గెలుస్తారో అక్కడ తేలుతుంద’ని తొడగొట్టి మీసం మెలేశారు. ఢిల్లీ వేదికగా ఈ సీన్ జరిగింది. ఓ దశలో టీడీపీ వైకాపా ఎంపీలు ఘర్షణ పడతారేమో అనే స్థాయిలో వాతావరణం వేడెక్కింది. అయితే, కాసేపటికే పరిస్థితి సద్దుమణిగింది.
ఏపీలో ప్రతిపక్షంతో సవాళ్లకు దిగాల్సిన సమయమా ఇది చెప్పండి..! ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రమంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకి వచ్చింది. కేంద్రమంత్రులు రాజీనామాలు చేశారు. ఇంకోపక్క, ఈ పరిస్థితిలో కూడా రాష్ట్రంలో అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని వైకాపా విమర్శలు చేస్తోంది.ఆ తీరు అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి తరుణంలో, అధికార పార్టీలో ఉంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అంశాలపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అంతేగానీ, వైకాపా ఎంపీలను రాజీనామా చేయాలనీ, అందులోనూ ముందుగా విజయసాయి రెడ్డి మాత్రమే రిజైన్ చేయాలనీ.. ఇలాంటి ఛాలెంజ్ లు అప్రస్తుతం. ఢిల్లీ వేదికగా ఇలాంటి గొడవలకు దిగడం అస్సలు సమర్థనీయం కాదు. కేంద్రంపై ఓ పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే క్రమంలో ఉంది. ఇలాంటప్పుడు టీడీపీ ఎంపీగా మరింత హుందాతనం ప్రదర్శించాలి.