తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమార్ అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై … జేసీ దివాకర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. తమను నడిరోడ్డుపై నిలబెట్టారని.. ఆర్థిక మూలాలను దెబ్బ తీశారని.. వచ్చే నాలుగేళ్లలో ఇంకా చాలా జరుగుతాయని ప్రకటించారు. అలాగని తాము నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని.. అలా చేయడం పిచ్చి పని అని తేల్చేశారు. తమకు న్యాయస్థానం ఒక్కటే ఇక ఆప్షన్ ఉందన్నారు. చట్టం, న్యాయం ఏమీ లేకుండా… ముఖ్యమంత్రి జగన్ ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని.. కావాలంటే మీరు కోర్టుకు వెళ్లండన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఆయనను ఎవరూ అదుపు చేయలేరని తేల్చేశారు.
అన్ని రకాల దేవుళ్లు ఆయనేనని.., సర్వశక్తి సంపన్నుడని.. ఆయనను ఏం చేసినా నాలుగేళ్లు భరించాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లను అరెస్ట్ చేయాలని జగన్‌కు ఉందని.. కానీ అలా చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంని.. కేంద్రం జోక్యం చేసుకుంటుందేమో అన్న భయంతో ఆగిపోతున్నారని జేసీ విశ్లేషించారు. తనకు ఎన్ని బస్సులు, లారీలు ఉన్నాయో తెలియదని.. అసలు ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న మాట నిజమే కానీ.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. అస్మిత్ రెడ్డి.. మూడేళ్ల కిందట సాక్షి ఆఫీసు ఎదుట ధర్నా చేశారని.. ఆ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు.
ప్రస్తుతం జగన్ పరిపాలనలో.. అరెస్ట్ కావడానికి నేరం చేయాల్సిన అవసరం లేదని జేసీ విశ్లేషించారు. ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ పాలనలో దయాదాక్షిణ్యాలు చూపించేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని… రాక్షస పాలన అని విమర్శించారు. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి… నాలుగేళ్ల పాటు ఏం చేస్తారో… చూద్దామని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజకీయంగా చేయగలిగిందేమీ లేదని.. కోర్టుల్లో పోరాడటం మాత్రమే మిగిలిదంని ఆయన నమ్ముతున్నట్లుగా ఉన్నారు. ఇంత జరిగుతున్నా.. జగన్ ను ఆయన మావాడు అనే సంబోధిస్తూ మాట్లాడుతున్నారు.