తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు అంటే ఏదో ఒక సంచన ప్రకటన ఉంటుందనే ఇమేజ్ ఉంది! అయితే, ఆ ప్రకటనలతో సొంత పార్టీని ఇబ్బంది పెట్టే సందర్భాలే ఎక్కువ. తాజాగా అదే పని చేశారు. కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులన్నీ మద్దతు ఇస్తున్నాయి. దీన్ని విజయవంతం చేయాలని, రమేష్ కు మద్దతుగా నిలవాలని సీఎం కోరారు కూడా! అయితే, దీనిపై జేసీ ఏమంటారంటే… ఇలాంటి దీక్షలు వల్ల ఉక్కు రాదు, తుక్కు రాదు అంటూ తన సహజ ధోరణిలో వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చెయ్యరనే విషయాన్ని తాను మూడేళ్లుగా చెబుతూనే వస్తున్నానని జేసీ అన్నారు. భాజపాని నమ్ముకోవద్దని చంద్రబాబుకు కూడా చెబుతూనే వచ్చాననీ, కానీ ఆయన విన్లేదని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు సీఎంకి పరిస్థితి అర్థమై ఉంటుందన్నారు. పాలకులకు పగలూ ప్రతీకారాలూ ఉండకూడదని హితవు పలికారు. జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయనకి అహంకారం ఎక్కువైపోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కీ జగన్ కీ చాలా తేడా ఉందన్నారు. వైయస్ లక్షణాల్లో సగమున్నా తామంతా ఆయన వెంటే ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డారు.
ఓపక్క కడప ఉక్కు కార్మాగారం సాధన కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే, మరోపక్క అదే ఉద్యమంలో భాగంగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ పై జేసీ ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచే వ్యక్తమౌతోంది. కేంద్రం ఏమీ చెయ్యదనే విషయాన్ని మూడేళ్ల కిందటే ముఖ్యమంత్రితో చెప్పానని పదేపదే చెప్పడం వల్ల కొత్తగా ఉపయోగం ఏముంటుంది..? ఏమీ చెయ్యదని తేలిపోయింది కాబట్టే కదా, ఇప్పుడు టీడీపీ పోరాటం చేస్తోంది. కేంద్రంపై ఏదో ఒక మార్గంలో ఒత్తిడి అనేది లేకపోతే.. ఏమౌతుందీ? రావాల్సినవి కూడా రావు. ఇప్పుడు దాని కోసం జేసీ ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. గతంలో చెప్పిన జోస్యం వదిలెయ్యండీ.. భవిష్యత్తు గురించి ఇప్పుడేం చేస్తున్నారో చెబితే పార్టీకి ఉపయోగకరం. అంతేగానీ, పార్టీ చేస్తున్న ఉద్యమాలను తప్పుబడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏముంటుంది..? ఈ వైఖరి వల్ల ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సిన పరిస్థితిని పెంచి పోషించినట్టు అవుతుంది కదా! కాబట్టి, ఇలాంటి వ్యాఖ్యలు చేయ్యొద్దంటూ ఆయన్ని పార్టీ అధినాయకత్వం మరోసారి హెచ్చరించే అవకాశం కనిపిస్తోంది.