ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మా ఫ్రెండ్ కుమారుడు అని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. అదే చొరవతో అవసరాన్నిబట్టీ పొగుడుతూ ఉంటారు, ఆ చొరవతో విమర్శలూ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రాలో పరిపాలన చాలా జనరంజకంగా జరుగుతోందన్నారు! ఈ మాట మాట్లాడుతున్నప్పుడు వెటకారపు బాడీ లాంగ్వేజే ఉంది! జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని గతంలో తనని అడిగారనీ, దానికి ఇప్పుడు సమాధానం చెబుతాననీ, 150 మార్కులు వేస్తున్నా అన్నారు జేసీ. అవి నూటికి తాను ఇస్తున్న మార్కులని చెప్పారు!
ఎప్పుడూ లేని విధంగా బస్సులు సీజ్ చేస్తున్నారన్నారు జేసీ. మరో మూడు నెలలు బస్సులు తిప్పకూడదని అంటున్నారన్నారు. తనకు రవాణా రంగంలో 70 సంవత్సరాల అనుభవం ఉందనీ, ఎప్పుడైనా ఏదైనా జరిగితే జరిమానా లాంటిదేదో ఉంటుందనీ, సస్పెన్షన్స్ లాంటివి లేవన్నారు. డ్రైవర్ కి బ్యాడ్జీ లేదనీ, ఇదీ అదీ లేదనీ, చిన్న చిన్న కారణాలను పట్టుకుని కేసులు పెట్టి పోలీస్టేషన్లో పడేస్తున్నారన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించారు? ఆ తరువాత, మరోసారి పాలన గురించి మాట్లాడుతూ… చాలా చక్కని పాలన అన్నారు. యంగ్ ఫెలో, పైనా కిందా పడుతూ లేస్తున్నాడు అంటూ సీఎం జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తన అబ్బాయి లాంటివాడేననీ, అయితే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు కాబట్టి దాన్ని నేను మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వంలో మన విన్నపాలను ఆలకించేవారు లేకపోతే న్యాయపోరాటం ఎవరికైనా తప్పదనీ, తనదీ అదే పరిస్థితి అని జేసీ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఒక లిస్టు వేసుకుని మరీ ఒక్కొక్కర్నీ జగన్ టార్గెట్ చేసుకుని ఆ విధంగా ముందుకు సాగుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న సందర్భం ఇది! గతంలో అంటే… జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఓ టెంటు వేసి మరీ రోడ్డు మీద బైఠాయించి జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. వాటిని జగన్ మరచిపోయారనుకోలేం కదా? ఇక, సందర్భం వచ్చిన ప్రతీసారీ జగన్ మీద జేసీ దివాకర్ రెడ్డి విమర్శలూ వ్యంగ్యాస్త్రాలు చెప్పాల్సిన పనిలేదు! ఎంత కాదనుకున్నా, ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకునే సందర్భాలు వచ్చినప్పుడు అవి గుర్తుకు రాకుండా ఉంటాయని అనుకోలేం కదా! ఇప్పుడు బస్సులు సీజ్ లు జరుగుతుంటే… న్యాయపోరాటమే శరణ్యం అన్నట్టుగా జేసీ మాట్లాడుతున్నారు. అదెలా సాగిస్తారో వేచి చూడాలి.