టీడీపీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వివాదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడేలా ఉంది! ఆ మధ్య వైజాగ్ విమానాశ్రయంలో జేసీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. సమయం కంటే ముందొచ్చినా తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ ఇండిగో సిబ్బందితో జేసీ దురుసుగా ప్రవర్తించారు. ప్రింటర్ ను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనపై జేసీ క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేరు. తాను వారితో పెద్దగా గొడవ పడలేదనీ, గంట ముందు వచ్చినా కూడా బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ జేసీ అదే వాదన వినిపిస్తూ వచ్చారు. దీంతో ఇండిగోతో సహా పలు విమానయాన సంస్థలు జేసీపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చే ప్రయత్నం చేస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో జేసీకి చేదు అనుభవం ఎదురైంది. బ్యాన్ ఉన్నందున బోర్డింగ్ పాస్ ఇవ్వలేమంటూ ట్రూజెట్ సంస్థ జేసీని వెనక్కి పంపేసింది. దీంతో చేసేది లేక జేసీ అవమానం పాలయ్యారు!
అయితే, ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగుదేశం సర్కారు భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తాజాగా ఇదే విషయమై స్పందించారని సమాచారం. వీలైనంత త్వరగా ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని సొంతంగా పరిష్కరించుకోవాలంటూ జేసీకి సీఎం చెప్పారట. ట్రావెల్ బ్యాన్ వివాదం నుంచి బయటపడేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజును సంప్రదించాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే, ఇది చాలా చిన్న వివాదమే. కానీ, విమానయాన సిబ్బందికి క్షమాపణలు చెప్పేందుకు జేసీ నిరాకరించడం, జాతీయ మీడియాలో కూడా ఇదే ఇష్యూ ప్రముఖంగా కథనాలు రావడం, ఈ క్రమంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపై కూడా విమర్శలు వినిపించడం, రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయంలో జేసీకి చేదు అనుభవం.. వెరసి దీనికి త్వరగా ముగింపు పలక్కపోతే పార్టీ పరువు పోయేలా ఉందని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారట!
ఇంతకీ.. ఈ వివాదానికి ముగింపు ఏంటంటే, విమానయాన సంస్థకు జేసీ క్షమాపణ చెప్పడమే అంటున్నారు. ఆ పని జేసీ చేస్తారా అనేదే అసలు ప్రశ్న..? విశాఖ విమానాశ్రయ ఘటనపై క్షమాపణలు చెప్పండీ అంటూ కేంద్రమంత్రి అశోక్ గజపతి ఆయన్ని కోరతారా..? ఒకవేళ అలా కోరితే జేసీ కూల్ గా స్పందించే పరిస్థితి ఉంటుందన్న నమ్మకం ఉందా..? లేదంటే, చట్టం తన పని తాను చేస్తుందని ఆ మధ్య కేంద్రమంత్రి చెప్పినట్టు చర్యలకు ఆదేశిస్తారా..? అయితే, గతంలో దాదాపు ఇలాంటి వివాదంలో శివసేన పార్లమెంటు సభ్యుడు గైక్వాడ్ చిక్కుకుంటే… ఆయనతో సిబ్బందికి క్షమాపణలు చెప్పించారు. మరి, ఇదే రీతిలో జేసీతో సారీ చెప్పించగలరా అనేదే అనుమానం!