అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తనకు.. పోలీసులకు మధ్య ఏర్పడిన వివాదాన్ని.. రాజకీయ నాయకులు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రబోధానంద ఆశ్రమం విషయంలో.. పోలీసులు సరిగ్గా వ్యవహరించలేకపోయారంటూ.. వారిని ఇష్టం వచ్చినట్లు విమర్శించారు జేసీ దివాకర్ రెడ్డి. దానికి అనంతపురం జిల్లా పోలీసు అధికార సంఘం నేత అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గోరంట్లలో సీఐగా పని చేస్తున్న ఆ పోలీసు సంఘం నేత.. కూడా.. హద్దులు దాటి పోయారు. మీసాలు మెలేసి… నాలుకలు కోస్తామని మాట్లాడేశారు. దీనిపై జేసీ కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికి రావాలో చిబితే వచ్చి నాలుకలు కోయించుకుంటామన్నారు. అయితే ఈ వివాదాన్ని జేసీ దివాకర్ రెడ్డి ఇంతటితో ఆపేలా లేరు. రాజకీయ నాయకులందర్నీ… పోలీసులుకు వ్యతిరేకంగా చేసేందుకు కొత్త వ్యూహం పన్నులుతున్నారు.
కర్నూలు జిల్లా అవుకులో చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జేసీ.. ఇతర నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీడియా రికార్డు చేస్తుందని తెలిసినా… ఘాటుగా మాట్లాడారు. ఆఫ్ ది రికార్డు అన్నట్లుగా.. అందరికీ వినిపించేలా…రాజకీయ నాయకులని రెచ్చగొట్టే విమర్శలు చేశారు. పోలీసు అధికారుల సంఘానికి-తనకు మధ్య ఏర్పడిన వివాదంపై ఏ ఒక్క ప్రజా ప్రతినిధీ ప్రతిస్పందించడం లేదంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.. తనను అంటే అందరినీ అన్నట్టే అని, అయినా ఏ ఒక్కరూ స్పందించలేదని జేసీ విమర్శలు గుప్పించారు. పోలీసులు తనపై చేసిన విమర్శలకు మద్దతుగా.. రాజకీయ నాయకులందరూ రావాలని జేసీ కోరుకుంటున్నారు. కానీ జేసీకి అది మొదటి వివాదం అయితే.. అంతో ఇంతో సపోర్ట్ లభించేదేమో..? కానీ జేసీ సంగతి తెలుసు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. అందుకే కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
మరో వైపు.. జేసీ బ్రదర్స్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని.. ప్రబోధానంద ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా ఓ గంట వీడియోను మీడియాకు పంపిన ప్రబోధానంద.. జేసీపై అనేక ఆరోపణలు చేశారు. ఆశ్రమాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. వాళ్ల ఆగడానలను ఆకట్టుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ప్రబోధానంద కుమారులు.. కొద్ది రోజుల కిందట బీజేపీలో చేరారు. బహుశా ఆ పార్టీ నుంచే ప్రబోధానంద జేసీపై తన రాజకీయ పోరాటన్ని ప్రారంభిస్తారేమో..?