హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. చంద్రబాబుకు కోపం, తాపం ఏమీలేవని, కాబట్టి ఆయన ఔట్‌డేటెడ్ పొలిటీషియనేనని, తమవాడు జగనేమో గయ్‌మని లేస్తున్నాడని, కోపం ఉందికాబట్టి లేటెస్ట్ పొలిటిషియనేనని చెప్పారు. జగన్ తమవాడేనని అన్నారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వైసీపీలో చేరబోతున్నారా అని అక్కడున్న రిపోర్టర్లకందరికీ సందేహం కలిగింది.
జేసీ దివాకరరెడ్డి ఇలా పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేయటం చాలా రోజులనుంచి జరుగుతోంది. ప్రత్యేకహోదా రాదని,అది చంద్రబాబుతోసహా తమపార్టీలోని అందరికీ తెలుసని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఒకపక్క ప్రత్యేకహోదాపై పార్టీ నాయకత్వం జనానికి సమాధానం చెప్పలేక సతమతమవుతూ ఉంటే జేసీ ఇలా చెప్పటం పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయనకు ఎందుకనో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇవాళకూడా ఏపీకి ప్రత్యేకహోదా రాదని జేసీ అసెంబ్లీ మీడియా పాయింట్వద్ద చెప్పారు. మరి ఇలా చెప్పటంలో ఆయన ఆంతర్యం ఏమిటో అర్థంకావటంలేదు. ఇదేమైనా శల్యసారథ్యమా అని అందరూ అనుకుంటున్నారు.
జేసీ ఇలా తనకు తోచింది తోచినట్లు, ఎవరినీ లెక్కచేయనట్లు మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలో 2004లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలోకూడా ఇలాగే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండేవారు. అది గుర్తుపెట్టుకున్న వైఎస్, 2009లో ఈయనకు మంత్రిపదవి ఇవ్వకుండా తొక్కేశారు. తనకు మంత్రిపదవి ఇవ్వకపోవటంపై జేసీ అప్పట్లో మీడియాముందు తెగ వాపోయేవారు. ఇక ఈయన తమ్ముడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి గురించి చెప్పనవసరంలేదు. ఒకసారి తమ ట్రావెల్స్‌కు చెందిన బస్సులకు పర్మిట్లపై ఏదో తేడా వచ్చి హైదరాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయంలోకి తన మందీ మార్బలంతో దూసుకెళ్ళి, ఉన్నతాధికారి గాంధీని కులంపేరుపెట్టి దుర్భాషలాడారు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉందికాబట్టి నడిచిపోయింది.