పార్టీకి తన అవసరం ఎప్పుడు ఉంటుందో.. అప్పుడే డిమాండ్లను తీర్చుకోవడానికి బ్లాక్ మెయిల్ చేయడంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పండిపోయారు. ఈ విషయంలో మరో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో తాను ఓటింగ్ కు హాజరు కాబోనంటూ ప్రకటించి.. అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని చెప్పుకొచ్చి.. తమ డిమండ్లేమిటో… హైకమాండ్‌కు కూడా తెలుసున్నట్లుగా హింట్ ఇచ్చారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన డిమాండ్ ను పరిష్కరించారు. అనంతపురంలో రహదారుల విస్తరణకు…రూ. 45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ప్రత్యేకంగా అమరావతి పిలిపించుకున్న చంద్రబాబు.. ఆయనతో చర్చలు జరిపి… రోడ్ల విస్తరణ జీవోను విడుదల చేశారు. ఈ విషయంపై జేసీ దివాకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో రేపు సమావేశాలకు హాజరవ్వాలని జేసీ నిర్ణయించుకున్నారు.
సీనియర్ ను అయిన తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని… జేసీ అసంతృప్తికి గురయినట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం మాత్రం.. అనంతపురంలో రోడ్ల విస్తరణతో పాటు… తన అనుచరులను పార్టీలో చేర్చుకునే విషయంపై టీడీపీ అధినేత తేల్చకపోవడమని చెబుతున్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గుర్నాథరెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి పార్టీలో చేర్చారు. ఆయనకు ఇంత వరకూ ఎలాంటి పదవి ఇవ్వలేదు.అలాగే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను కూడా పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జిల్లా పార్టీ నేతలు అంగీకరించడం లేదు . మహానాడు సమయంలో పార్టీ చేర్పిద్దామని… జేసీ దివాకర్ రెడ్డి.. మధుసూదన్ గుప్తాను అనుచరులతో సహా విజయవాడకు రప్పించారు. కానీ చంద్రబాబు తర్వాత చూద్దామని చెప్పారు.ఇలాంటి కొన్ని విషయాల్లో సమయం చూసి.. టీడీపీ అధినేతను బ్లాక్ మెయిల్ చేసే రాజకయం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.
ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ల విస్తరణ జీవో జారీ చేయడంతో.. ఆయన ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారు. ఓటు కూడా వేస్తారు. గత ఏడాది.. కూడా ఓ సారి ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తో ఆయన రాజీనామా అస్త్రం సంధించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చాగల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడంతో శాంతించారు. ఇప్పుడు అనంతపురంలో రోడ్ల విస్తరణకూ ఆలాగే ఆమోదం పొందారు. మామూలుగా ఇతర నేతలు ఎవరైనా ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే… వారి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోతుంది. కానీ జేసీ మాత్రం తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయం చేస్తారు. అనుకున్నది సాధించుకుంటారు.