తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ ఇది! అదేనండీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో సిబ్బందితో ఆయన దురుసుగా ప్రవర్తించారు కదా..! దాంతో ఇండిగో సంస్థ సహా కొన్ని దేశీయ విమానయాన కంపెనీలు జేసీపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. జేసీ క్షమాపణలు చెబితే తప్ప విమానయానానికి అనుమతులు లేవంటూ భీష్మించాయి. అంతేకాదు, హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వద్దామని ప్రయత్నించినా, ఆయన్ని శంషాబాద్ నుంచి వెనక్కి పంపి అవమానించాయి కూడా! ఇంత పట్టుదలగా ఉన్న విమానయాన సంస్థలు ఉన్నట్టుండి ఆ పట్టు సడలించేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది! జేసీపై ఉన్న ట్రావెల్ బ్యాన్ ను ఎత్తేస్తున్నట్టు ముందుగా ఇండిగో సంస్థ ప్రకటించింది. ఆ తరువాత, మిగతా దేశీయ సంస్థలు కూడా ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం ఆశ్చర్యకరం!
ఏ ప్రాతిపదిక ఆయన జేసీపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేశాయా అనేదే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమౌతున్న సందేహం..? విమానయాన సంస్థలకు జేసీ బహిరంగంగా క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు. పైపెచ్చు సంస్థల నిర్ణయంతో పంతానికి వెళ్లింది కూడా ఆయనే. విశాఖలో ఎయిర్ పోర్టులో ప్రింటర్ ను ఎత్తేయబోయి, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన విజువల్స్ ఉన్నా కూడా… అబ్బే, అలా చేయలేదని బుకాయించారు. అంతేకాదు, తనపై ఉన్న నిషేధాన్ని సడలించాలంటూ ఆయనే స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. జేసీ దురుసు ప్రవర్తనపై కోర్టు కూడా అక్షింతలు వేసింది. ‘దివాకర్ ట్రావెల్స్ లో ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే మీరు ఊరుకుంటారా.. చర్యలు తీసుకోరా’ అంటూ కోర్టు జేసీని ప్రశ్నించింది. వ్యవహారం ఇంత పీక్స్ కి చేరిన తరుణంలో… బాధిత ఇండిగో సంస్థే జేసీపై ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం విశేషం.
నిజానికి, జేసీ దురుసు ప్రవర్తన జాతీయ మీడియాలో ప్రధానంగా నిలిచింది. దీంతో వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచించారు. ఆ తరహాలో జేసీ ప్రయత్నించిందీ లేదు! కానీ, ఎక్కడా ఎలాంటి ప్రయత్నాలూ జరక్కుండానే ఇప్పుడు జేసీకి ఇలా ఊరట ఎలా లభించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ విమానాశ్రయంలోనే జేసీని సిబ్బంది అడ్డుకుంటే, అక్కడే ఉన్న కేంద్రమంత్రి అశోక్ గజపతి జోక్యంతో బోర్డింగ్ పాస్ ఇప్పించారంటూ విమర్శలు వచ్చాయి. మరి, ఇప్పుడు ఇంకెన్ని విమర్శలు వినిపిస్తాయో..! ఏదేమైనా, అధికారంలో ఉన్నవారికి ఇలాంటి ఇష్యూలు డీల్ చేయడం చాలా ఈజీ అనేది మరోసారి నిరూపితం అయిందని చెప్పుకోవాలి.