కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయమై మరోసారి కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ని టీడీపీ ఎంపీలు కలిసిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి సానుకూల ప్రకటన ఇవ్వాలంటూ ఎంపీలు ఓ వినతి పత్రం అందించారు. నిజానికి, టీడీపీ ఎంపీలు చేస్తున్న ఈ ప్రయత్నంతో కేంద్రం అనూహ్యంగా స్పందించేస్తుందన్న విశ్వాసం లేదు! కానీ, ఏదేమైనా ఆంధ్రాలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనడం విశేషం! కేంద్రం ఏమీ ఇవ్వదూ, పొత్తు పెట్టుకోవడమే అనవసరం అనే విషయం మూడేళ్ల కిందటే తాను చెప్పానని అంటుండే జేసీ… కడప ఫ్యాక్టరీ విషయంలో ఇలా స్పందించడం ఆసక్తికరమే.
కడప స్టీల్ తమకు రావాలనీ, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా సంతోషిస్తామనీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రాయితీలు ఇవ్వాలనీ, మైనింగ్ లీజ్ ఇవ్వాలని కోరామన్నారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వంతోపాటు ప్రైవేటు భాగస్వామ్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునే విధంగానైనా వెసులుబాటు ఇవ్వాలని కోరామన్నారు. కాబట్టి, ఏదో ఒక విషయమై తేల్చాలంటూ కేంద్రానికి ఆప్షన్లు ఇస్తే… కేంద్రమంత్రి సానుకూలంగానే స్పందించారనీ, ఓవారం రోజులు లోపుగా ఒక ప్రకటన చేస్తానని హామీ ఇచ్చినట్టు జేసీ చెప్పారు. ఏదో ఒక రూపంలో కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామనే ఆశాభావం ఆయన కనబర్చారు అన్నారు. తమ పట్టుదలకు ఒక ప్రతిఫలం ఉంటుందనీ, ఏదేమైనా కడప ఉక్కు ఫ్యాక్టరీ చూస్తామన్నారు.
జేసీకి ఇంత నమ్మకం ఎలా కలిగిందో తెలీదుగానీ… కడప ఉక్కు కర్మాగారం ఆలస్యం కావడానికి కారణం కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కదా! ఇంకోటి.. వారం లోగా ఏదో ఒక ప్రకటన చేస్తామని బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారనీ జేసీ అంటున్నారు. ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా చాలానే చూశాం. సుప్రీం కోర్టులో కేంద్రం ఫైల్ చేసిన అఫిడవిట్‌ను కూడా చూశాం! ఇవన్నీచూశాక.. వారంలోగా కడప ప్లాంట్ విషయమై ఏదో అనూహ్య ప్రకటన వెలువడితే అద్భుతమే! ఫ్యాక్టరీ ఎందువల్ల సాధ్యం కాదు… అనే అంశంపై గతంలో కేంద్రమే కొన్ని కారణాలు చూపించింది. ఉన్నట్టుండి ఈ అభ్యంతరాలన్నీ తొలగిపోయి.. ఫ్యాక్టరీ ఏర్పాటుకు సానుకూల ప్రకటన ఉంటుందని జేసీ బలంగా నమ్ముతారు మరి!