ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకుని చేరికల్ని భాజపా ప్రోత్సహిస్తుందనే ఊహాగానాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. దాన్లో భాగంగా ఇప్పటికే రాయలసీమకు చెందిన కొందరు ప్రముఖ నేతలతో భాజపా టచ్ లోకి వెళ్లిందన్న కథనాలూ వచ్చాయి. ఆ లిస్టులో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పేరు ఉందని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించిన సందర్భమూ ఉంది! తన వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం భాజపావైపు మొగ్గే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతికి వచ్చారు జేసీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ… భాజపా నుంచి తనకు ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని అన్నారు.
ఆహ్వానం అందిన మాట వాస్తవమేననీ, ఆ విషయం అంతవరకేనని జేసీ అన్నారు. ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పారనీ, భాజపాలోకి రమ్మన్నారనీ, అయితే ఆయన సలహాతో తాను వెళ్లిపోతానా అని జేసీ ఉల్టా ప్రశ్నించారు. ఆయన చెప్పారని పోతే, తన నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఏమౌతుందన్నారు. అలాగని వెళ్లనని కూడా స్పష్టంగా చెప్పలేదు! తనకు ఇతర జాతీయ పార్టీల్లో కూడా మిత్రులున్నారనీ, కాబట్టి భాజపా నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పెద్దది చేసి చూడొదన్నారు. ఇంతకీ మీరు భాజపాలో చేరుతున్నారా లేదా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ…. చేరడం, చేరకపోవడం అనే మాటే లేదనీ, ఎందుకంటే తాను క్రియాశీల రాజకీయాల్లో లేనని జేసీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్నారు. తొలిసారి ఢిల్లీ వెళ్లిన జగన్.. హుందాగా వ్యవహరించారన్నారు. ఎవరికో భయపడి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదనీ, తన మనసుకు అనిపించింది చెప్పానన్నారు. పులివెందుల నుంచి వచ్చిన ఒక అబ్బాయిగా అలా వ్యవహరిస్తాడని తాను ఊహించలేదన్నారు. వాస్తవాన్ని గ్రహించి, ప్రధానమంత్రికి నమస్కారం పెట్టడంలో తప్పేముందన్నారు.
ఆహ్వానం అందిన నేపథ్యంలో జేసీ వ్యాఖ్యల్ని కూడా ఓసారి గమనించాలి. ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని… గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా ఇలానే కదా కేంద్రంతో వ్యవహరించారు అనే పోలిక తీసుకొచ్చి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్రంతో పోరాట పంథాలోనే హోదా తెచ్చుకుంటామని చెప్పి, ఇప్పుడు వెనక్కి తగ్గడాన్ని విమర్శిస్తున్నారు. ఆ కోణంలో జేసీ మాట్లాడలేదు! ఏదేమైనా, ఆంధ్రాలో టీడీపీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలను భాజపా మొదలుపెట్టిందనేది జేసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమౌతోంది.