అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… తెలుగుదేశంపార్టీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంపై తాడో పేడో అన్నట్లుగా.. టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి… బీజేపీకి వ్యతిరేకంగా పార్టీల మద్దతును కూడగట్టే పనిలో ఉంటే.. సొంత పార్టీకి అండగా ఉండాల్సిన జేసీ.. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. కలకలం రేపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను హాజరు కాబోవడం లేదని ప్రకటించారు. తన అసంతృప్తిని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ… లోక్‌సభకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసనుకుంటానంటూ.. అధినేతకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా స్టేట్మెంట్లిచ్చేశారు.
నిన్న ఉదయం వరకూ బాగానే జేసీ దివాకర్ రెడ్డి.. హఠాత్తుగా అలగడానికి కారణమేమిటనన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎవరెవరు మాట్లాడాలన్నదానిపై… ఎంపీలు కసరత్తు చేశారని.. అందులో జేసీ దివాకర్ రెడ్డిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే.. ఆయన అలిగారన్న ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినా.. చర్చలో ఆయా పార్టీలకు లభించే సమయం మాత్రం.. పార్టీల బలాబలాల ఆధారంగానే ఉంటుంది. ఎన్ని గంటల చర్చ అన్నదాని ఆధారంగా స్పీకర్ .. సమయం కేటాయిస్తారు. విభజన సమస్యల విషయంలో.. కేంద్రం తీరును.. పూర్తి స్థాయిలో దేశం మొత్తానికి తెలిసేలా చేయాలంటే… హిందీ, ఇంగ్లిష్‌లలో అనర్గళంగా మట్లాడేవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సహజంగానే ఈ విషయంలో సీనియర్ ఎంపీలు వెనుకబడిపోయారు.
తెలుగుదేశం పార్టీ తరపున హిందీలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇంగ్లిష్‌లో గల్లా జయదేవ్ మాట్లాడటానికి అవకాశం ఉంది. మూడో ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం రావొచ్చు. ఆ అవకాశం కోసం.. ఇతర ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి సీనియర్‌గా తనకు చాన్స్ వస్తుందని ఆశించినట్లున్నారు. కానీ దివాకర్‌కు మైక్ ఇస్తే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో.. అందరికీ తెలుసు కాబట్టి.. ఈ విషయంలో ఆయనను మొదటి రౌండ్లోనే పక్కన పెట్టేశారు. అందుకే.. జేసీ .. తనకు హిందీ రాదంటూ… మీడియా ముందు సెటైర్లేశారు. ఓడిపోతామని యుద్ధం చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
అలిగి .. ఆగ్రహించి.. అనుకున్నవి చేయించుకోవడం జేసీ దివాకర్ రెడ్డి స్టయిల్. గతంలో తన నియోజకవర్గంలో ఓ చెరువుకు నీరు విడుదల చేయలేదని.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికప్పుడు చంద్రబాబు ఆదేశాలిస్తే కానీ వెనక్కి తగ్గలేదు. ఇలాంటి బెదిరింపుల ఎపిసోడ్లు జేసీ దివాకర్ రెడ్డి చాలా చేశారు. తను అనుకున్నది అయితే.. జేసీ మళ్లీ మూములవుతారు. ఆయన అనుకున్నది.. పార్లమెంట్లో స్పీచా…? మరొకటా అన్నది తర్వాత తెలుస్తుంది.