కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ.. ఇక నుంచి.. ఆంధ్రప్రదేశ్‌కు బెల్లం ముక్క కూడా ఇవ్వరని.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. ఆయన ఒక్కరే కాదు.. పదాల్లో కొంచెం తేడా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ ఎంపీలందరికీ దీనిపై క్లారిటీ ఉంది. కానీ వారికి… రాజకీయ పోరాటం మాత్రం తప్పడం లేదు. జిల్లాల వారీ సభల్లో భాగంగా..అనంతపురం జిల్లాలో ఎంపీలు.. ఒక రోజంతా దీక్ష చేశారు. కరువు జిల్లాలకు నిధులు వెనక్కి తీసుకోవడానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. ఇందులో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో సైటర్లు వేశారు. ఏ చేసినా.. ఏపీకి మోడీ ఏమీ ఇవ్వరన్నారు. కానీ మరో మూడేళ్లలో కోనసీమను తలదన్నేలా రాయలసీమ అభివృద్ది చెందుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో రాయలసీమ పౌరుషం ఏంటో కేంద్రానికి చూపిస్తామని ఎంపీ సీఎం రమేష్ చాలెంజ్ చేశారు. 17న జరిగే అఖిలపక్ష సమావేశానికి దమ్ముంటే వైఎస్ జగన్ హాజరుకావాలని సవాల్ విసిరారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కై రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కూడా తెలుగువాడి సత్తా చాటి.. కేంద్రం మెడలు వంచుతామని, ఇందుకు రాష్ట్రంలో ఉన్న ప్రజల అండదండలు కావాలని ఆయన కోరారు.
విషయం ఏమిటంటే.. ఎవరైనా యుద్ధానికి వెళ్లే ముందు.. కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో వెళ్తారు. వెళ్లాలి కూడా. లేకపోతే.. యుద్ధ చేసే తీరులోనే తేడా వస్తుంది. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం.. కేంద్రం ఏమీ ఇవ్వదంటూనే.. ఢిల్లీలో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రాన్ని ఏ మాత్రం కదిలిస్తారో చూడాలి మరి.. !