అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం.. రచ్చ రచ్చ అవుతోంది. వినాయక నిమజ్జనం సందర్భంగా… ఆశ్రమంలో ఉండే ప్రబోధానంద భక్తులు.. సమీప గ్రామస్తులపై దాడులు చేయడంతో వివాదం ప్రారంభమయింది. తానా..? ప్రబోధానందనా..? అన్నట్లుగా.. తేల్చుకోవాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిసైడవడంతో…వందల సంఖ్యలో పోలీసుల్ని.. చివరికి ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆక్టోపస్ బృందాన్ని రంగంలోకి దించి.. ఎలాగోలా పరిస్థితిని చక్కదిద్దారు. చివరికి తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం నుంచి భక్తుల్ని పంపించగలిగారు. లోపల.. ఏం జరుగుతోందన్నదానిపై.. సోదాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. దీని కులం కోణం కూడా జోడించేందుకు ప్రతిపక్ష నేత జగన్ కు చెందిన మీడియా… అనేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఇదేదో.. కులం గొడవ అన్నట్లుగా మారిపోయింది. అసలు ప్రబోధానంద… విషయంలో .. ఏం జరిగిందో..? ఈ ప్రబోధానంద చరిత్ర ఏమిటో.. తాను బయటపెడతానంటూ.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. అయితే.. సమయం లేకపోవడంతో బుధవారం ఉదయం కలుద్దామని.. జేసీకి చంద్రబాబు సూచించారు. ఓ పెన్ డ్రైవ్‌ను మీడియాకు చూపించిన జేసీ దివాకర్ రెడ్డి.. స్వామీజీ బండారం అంతా అందులో ఉందని చెప్పుకొచ్చారు. సీఎంను కలిసిన తరువాత పెన్‌డ్రైవ్ మీడియాకు ఇస్తానని ప్రకటించారు. నిజానికి ప్రబోధానంద వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన ఆశ్రమం లోపల ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. డేరాబాబా తరహా కార్యకలాపాలు జరుగుతున్నాయని.. జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నారు. దీనికి సంబంధించిన పెన్ డ్రైవ్ లో ఏమైనా బయటపెడతారేమో చూడాలి..!
మరో వైపు ప్రబోధానంద బోధనలు… అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి. త్రైత సిద్దాంతం పేరుతో అన్ని మతాల దేవుళ్లను… దారుణంగా… తిడుతూ.. ప్రసంగాలు చేసిన వీడియోలు ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. త్రైత సిద్ధాంతం పేరుతో కొత్త మతాన్ని ఆయన ప్రచారం చేస్తున్నారు. దీని కోసం…తన బోధనల్లో… తాగుబోతులు మాట్లాడుకునే తిట్లను కూడా విరివిగా వాడేస్తున్నారు. మొత్తానికి ప్రబోధానంద వ్యవహారం..రాబోయే రోజుల్లో మరో డేరాబాబాలా మారే అవకాశం కనిపిస్తోంది.