తెలుగు రాజకీయాలలో జేసీ దివాకర్ రెడ్డి ది సెపరేట్ స్టైల్. ఎవరేమనుకున్నా, తమ పార్టీ అభిమతమేదైనా తాను చెప్పాలనుకున్నది తాను సూటిగా చెప్పడం ఆయన శైలి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాత కాంగ్రెస్ మిత్రులను కలిసిన జెసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో షర్మిల పార్టీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు:
షర్మిల త్వరలో లాంచ్ చేయనున్న పార్టీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ, షర్మిలను తెర వెనకాల బిజెపి నడిపిస్తోందని జేసీ పేర్కొన్నారు. అయినా ప్రస్తుతానికి తెలంగాణలో ప్రాక్టీస్ కోసం మాత్రమే పార్టీ పెట్టిందని, ఇక్కడ ఏడాది పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయవాడకు మకాం మారుతుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ఆమె పార్టీకి 5 శాతం ఓట్లు కూడా రావని కుండ బద్దలు కొట్టారు జెసి దివాకర్ రెడ్డి. అయితే నిజంగా షర్మిల పార్టీ వెనక బిజెపి ఉందా అన్న చర్చ గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. అసలు అది సాధ్యమా అన్న చర్చ కూడా మరొకవైపు నడుస్తోంది. అయితే ప్రజలు బద్ధ శత్రువులు అనుకున్న రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉండడం, ఒకే రకమైన సైద్ధాంతిక భావజాలం ఉన్న పార్టీల మధ్య అంతర్గత శత్రుత్వం ఉండడం రాజకీయాల్లో సాధ్యమే. కొన్నిసార్లు ప్రజలకు ఇది అర్థం కాకపోవడం రాజకీయ పార్టీలకు వరంగా మారుతోంది. మరి జేసీ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉందన్నది విశ్లేషిస్తే..
టిఆర్ఎస్ కి సరైన ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకునే పనిలో బిజెపి:
ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ ని లాంచ్ చేయడానికి వైయస్ షర్మిల సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించి దశలవారీగా వైయస్ సన్నిహితులను అభిమానులను కలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ కి బిజెపి బలమైన ప్రత్యామ్నాయంగా దూసుకు వస్తుంది. దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కంటే మెరుగైన ఫలితాలు సాధించి టిఆర్ఎస్ కి అసలైన ప్రత్యామ్నాయం గా తాము మారామని బిజెపి ప్రచారం చేసుకుంటోంది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎంఐఎం ని బూచిగా చూపి బిజెపి ఓట్లు సంపాదించింది అన్న విమర్శ ఉంది. హిందుత్వం అజెండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఎంతవరకు ఉంది అన్న విషయం పై బిజెపి లోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ ని మట్టికరిపించడానికి హిందుత్వ ఎజెండా సరిపోదని బిజెపి భావిస్తున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమ ఓట్ల శాతం పెంచుకో లేనప్పుడు అవతలి పక్షం ఓట్లు చీల్చడమే మార్గం:
రాజకీయాలలో తమ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం లేనప్పుడు అవతలి పక్షానికి చెందిన ఓట్లను చీల్చడం అనేది ఎప్పటి నుండో ప్రధాన ఆయుధంగా ఉంది. అయితే ఈ ఆయుధాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో బిజెపి ఇటీవలి కాలంలో రాటు తేలినట్లు కనిపిస్తుంది. ఆమధ్య బీహార్ ఎన్నికలలో తమకు రావాల్సిన దాని కంటే తక్కువ ఓట్లు సీట్లు రావడానికి ఎంఐఎం ప్రధాన కారణం అని లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జెడి నేతలు వ్యాఖ్యానించారు. బిజెపి వ్యతిరేకత కలిగిన మైనారిటీలు పూర్తిగా తమ వైపు రాకుండా ఎంఐఎం ని లోపాయికారిగా బిజెపి పెద్దలు ప్రోత్సహించి బీహార్లో పోటీ చేసేలా చేశారని కూడా వారు ఆరోపించారు. ఇప్పుడు బెంగాల్ లో సైతం ఎంఐఎం పోటీ చేయడానికి బిజెపి లోపాయికారీగా ప్రోత్సాహం ఇవ్వడమే కారణం అని ఒక వర్గం విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో షర్మిల పార్టీ బిజెపికి ఏవిధంగా లాభం చేకూరుస్తుంది అంటే:
ఈ నేపథ్యంలో రకరకాల కారణాల వల్ల వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. గోనె ప్రకాశ్ రావు వంటి వైయస్సార్ సన్నిహితులు షర్మిల కి భారతి తో ఉన్న విభేదాలు, జగన్ రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం వంటివి ఆవిడ పార్టీ పెట్టడానికి ప్రధాన కారణాలని టీవీ డిబేట్ లలో చెబుతూ వస్తున్నారు. అయితే షర్మిల పార్టీ బిజెపికి మరొక విధంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. బిజెపి హిందూత్వ ఎజెండా కారణంగా మైనారిటీల ఓట్లు టీఆర్ఎస్ వైపు polarize అవుతూ ఉండడంతో, టిఆర్ఎస్ కు పడాల్సిన ఆ ఓట్ల లో కొన్నింటిని షర్మిల పార్టీ చీల్చినా కూడా అది బిజెపికి లాభం చేకూర్చే పరిణామం అవుతుందని కొందరు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మరికొందరు మాత్రం షర్మిల పార్టీ వెనకాల కెసిఆరే ఉన్నాడని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపి వైపు మాత్రమే కాకుండా విభిన్న పక్షాల మధ్య చీలితే అది అధికార పార్టీకి లాభం చేకూరుస్తుంది అనే ఉద్దేశంతో షర్మిల పార్టీని కెసిఆర్ ప్రోత్సహిస్తున్నారని ఒక వర్గం వాదిస్తోంది. అయితే ఈ వాదనకు విశ్లేషకుల నుండి పెద్దగా మద్దతు లభించడం లేదు. షర్మిల పార్టీ పెట్టి ఎంతగా ప్రజల్లోకి వెళ్లినా, సమీప భవిష్యత్తులో షర్మిల పార్టీ సాధించబోయే ఓట్లు ప్రధానంగా రెండు వర్గాలకు చెందినవి మాత్రమే అయి ఉండే అవకాశం ఉందని, ఆ రెండు వర్గాల లో బిజెపికి పెద్దగా పట్టు లేదని, కాబట్టి షర్మిల పార్టీ సాధించే ఓట్లు- అవి కొన్నే అయినప్పటికీ, అవి కచ్చితంగా టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఓట్లని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని టీవీ డిబేట్ లలో బలంగా వాదించారు. ఒకవేళ ఈ వాదనే కనుక నిజం అయి, షర్మిల పార్టీకి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉండి ఉంటే షర్మిల రాజకీయ పార్టీకి తెలంగాణ ప్రజలు నుండి మద్దతు లభించినా, లభించకపోయినా దీర్ఘకాలంలో షర్మిల రాజకీయ భవిష్యత్తుకి మాత్రం మంచి భరోసా ఉండే అవకాశం ఉంది.
ముగింపు:
ఏదేమైనా భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడం, ఒకే ఎజెండా కలిగిన పార్టీల మధ్య శత్రుత్వం ఉండడం అన్నది ఎప్పటి నుండో ఉన్నదే. స్వాతంత్రానికి పూర్వం కూడా మదన్ మోహన్ మాలవ్య వంటి నేతల హిందూ మహాసభ, జిన్నా ముస్లింలీగ్ లు బలంగా పోరాడిన నియోజకవర్గాల్లో గాంధీ నెహ్రూల కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడం తెలిసిందే. అదేవిధంగా – బ్రాహ్మణ వ్యతిరేక అజెండాతో ఏర్పడ్డ జస్టిస్ పార్టీకి అదే అజెండాతో ఏర్పడ్డ మద్రాసు నేటివ్ అసోసియేషన్ వంటి పార్టీతో అంతర్గతంగా శత్రుత్వం ఉండేది. మరి మొత్తం మీద షర్మిల బీజేపీ పార్టీల మధ్య నిజంగా లోపాయికారీ అవగాహన ఉందా లేదా అన్నది తెలియడానికి మాత్రం ప్రజలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
– ZURAN