స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషించే నేతలు కొంతమంది ఉంటారు! అలాంటివారిలో తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలపై నిష్కర్షగా విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే జేసీ తాజా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో తనకు దక్కుతున్న గుర్తింపు గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విలేకర్ల వద్ద జేసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగానే మారుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పద్ధతి ఇంకా మార్చుకోవడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఉద్యోగులనే నమ్ముకుంటున్నారనీ, అలా పరిపాలన చేయడం సరికాదని గతంలో తాను చాలాసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని జేసీ వ్యాఖ్యానించారు. తాను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం చంద్రబాబు కాదనీ, ఆయన పిలవగానే వచ్చేయడానికి ఆయన మహాత్మా గాంధీ కాదు కదా అని జేసీ వ్యాఖ్యానించడం గమనార్హం. వైకాపా అధినేత జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్దేశంతోనే తాను తెలుగుదేశంలో చేరానని జేసీ అన్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతన గురించి కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉంటున్న సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వంటివారికే పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతుంటే, ఇక తనలాంటి వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా మాట్లాడకోవాల్సిన పనిలేదని జేసీ వ్యాఖ్యానించారు. పయ్యావుల వంటి వారికే న్యాయం జరగకపోతే, ఇక తమ గురించి ఆలోచించేవారు ఎవరుంటాయని కాస్త నిష్టూరంగానే జేసీ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే, ఇన్నాళ్లూ కేవలం ప్రభుత్వ విధానాలపైన మాత్రమే విమర్శలు చేసేవారు. తనగోడు మాత్రమే వినిపించుకునేవారు. కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలకే గుర్తింపు లభించడం లేదని ఆయన ఆరోపించడం విశేషమే కదా! నిజానికి, తెలుగుదేశంలో కొంతమంది సీనియర్లు నిరాదరణకు గురౌతున్నట్టుగా కథనాలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితిపై జేసీ వ్యాఖ్యానించడం చర్చకు కారణమౌతోంది. మరి, ఈ వ్యాఖ్యలపై ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తారో లేదో..!