వంద రోజుల్లో జగన్ పాలనకు వందకు వంద మార్కులేసేశారు… అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంతో.. తనకు స్పెషల్ పెటేంట్ ఉందని.. ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో జగన్ వంద రోజుల పాలనపై… మీడియాతో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు.. పాత గవర్నమెంట్ ప్లస్‌లు, మైనస్‌లు చూస్తుందని ఇప్పుడు …అదే జరుగుతోందని.. చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, పథకాలన్నింటినీ రద్దు చేయడంపై… జేసీ ఇలా స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న రద్దులు, సమీక్షలు, రివర్స్ టెండరింగ్ నిర్ణయాలను.. మైక్రోస్కోప్‌లో చూడాలే తప్ప పగలగొట్టి చూస్తే ఎలా అని సెటైర్ వేశారు.
రాజధాని అమరావతిలోనే ఉంటుందని…ఎక్కడికీ తరలిపోదని వ్యాఖ్యానించారు. జగన్ ను ఎప్పటిలాగే మావోడని… కలిపేసుకున్నారు జేసీ. కానీ… గతంలో అయితే.. మావోడని చెప్పి… తీవ్రమైన విమర్శలు చేసేవారు. తనను పార్టీలోకి పిలిచి.. టిక్కెట్ ఇచ్చేందుకు డబ్బులడిగారని మండిపడ్డారు. జగన్ గురించి తనకు చిన్నప్పటి నుండి తెలుసని చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు మాత్రం… మాట సవరించుకున్నారు. మా వాడు అంత తెలివి తక్కువ వాడు కాదని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. జగన్ అపోజిషన్‌లో ఉన్నా..అధికారంలో ఉన్నా మావాడేనని ప్రకటించేశారు. జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందేనన్నారు. జగన్ నడుస్తున్నాడు…పడుతున్నాడని… ఇంకా చెయ్యి పట్టుకొని నడిపించేవాళ్లు లేరని చెప్పుకొచ్చారు. జగన్ అడిగితే సలహాలు ఇస్తానని ఆ చాన్స్ తీసుకునేందుకు కూడా.. ఓ మాట మీడియాకు చెప్పుకొచ్చారు. మళ్లీ వెంటనే.. తమను పార్టీలోకి ఎవరు తీసుకుంటారని…నిరాశ వ్యక్తం చేశారు.
సలహాలు అడిగితే ఇస్తానంటూనే.. కొన్ని సలహాలను మీడియా ద్వారా ఇచ్చేశారు. ఏ ప్రభుత్వం కూడా వ్యాపారం చేయకూడదని…ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం వ్యాపారమేనని తేల్చారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలవడమే కాదు.. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన జేసీ బ్రదర్స్ కుమారులిద్దరూ… ఓడిపోయారు. అప్పట్నుంచి… నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జేసీ మాట మార్పునకు… ఈ పరిణామాలే కారణమని భావిస్తున్నారు.