టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరే వేరు..! ఆయన ఎప్పుడు ఏది ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ తెలీదు! ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభల్లో ఆయనకి మైక్ దొరికితే… మాటలు ఇంకోలా ఉంటాయి. కర్నూలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో అదే జరిగింది. సీఎం సమక్షంలో ఆయనకు మైక్ దొరికింది. అంతే… చంద్రబాబును మెచ్చుకుంటున్నట్టుగానే విమర్శించారు, విమర్శిస్తున్నట్టుగానే మెచ్చుకున్నారు..!
‘నాకు మీరు మంత్రి పదవి ఇయ్యరు కాక ఇయ్యరు. నేను రాజకీయాల్లోంచి కూడా విరమించుకో దల్చుకున్నా. మళ్లీ మరోసారి ఎంపీ కావాలో, ఎమ్మెల్యే కావాలనే ఆశ కూడా లేదు. మీరు నాకు చేసేది ఏమీ ఉండదు’ అన్నారు. అంతేకాదు, సభా వేదిక మీద కూర్చున్న మంత్రులూ ఇతర ప్రముఖ నేతల్ని చూపిస్తూ… ఇదిగో ఇలాంటి వాళ్లంతా అప్పుడప్పుడూ మిమ్మల్ని మిస్ లీడ్ చేస్తుంటారన్నారు. ‘మీకున్నటువంటి ఒకటో రెండో మంచిని గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది’ అన్నారు జేసీ. ధర్మపోరాట దీక్షతో పదేపదే ప్రజల దగ్గరకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే, భాజపా రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలు గ్రహించారనీ, ఆ పార్టీకి ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదన్నారు. అంత డీప్ గా ప్రజల్లోకి మీరు తీసుకెళ్లారని మెచ్చుకున్నారు. బీజేపీతో విడాకులు తప్పదని మూడేళ్ల కిందటే చెప్పానని, కానీ చంద్రబాబు నాయుడు విన్లేదనీ, తొందరపడితే ఎలా దివాకర్ అంటూ సర్దిచెప్పారని మళ్లీ చెప్పారు!
‘రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు కట్టారు సార్ మీరూ, ఎన్ని పెన్షన్లు.. ఎక్కువైపోయి మిగిలిపోతున్నాయి సార్’ అంటూ జేసీ మెచ్చుకున్నారు! ఇరవై రూపాయలకి బియ్యం కొని ఒక్క రూపాయి ఇస్తున్నారన్నారు. పండుగ పండుగకీ సంచులిస్తున్నారూ, రూ. 2 వేల పెన్షన్, ఇప్పుడు నిరుద్యోగులకు డబ్బులు కూడా ఇస్తారు అన్నారు. ఇన్ని స్కీమ్స్ ఉన్నా.. వాటిని ప్రజలు రెండ్రోజులే గుర్తుపెట్టుకుంటారనీ… అలాగని తప్పుబట్టడం తన ఉద్దేశం కాదని జేసీ చెప్పారు! అదే, ఒక్క ఎకరాకు నీళ్లిస్తే తరతరాలు మిమ్మల్ని మరచిపోలేరనీ, కాబట్టి సాగునీటి ప్రాజెక్టులపైనే శ్రద్ధ పెట్టాలని జేసీ కోరారు! సంక్షేమ పథకాలు చాలనీ, ఇప్పటికే కడుపునిండిపోయిందన్నారు.
తనకు మంత్రి పదవి రాదని అసంతృప్తి వ్యక్తం చెయ్యడం వరకూ ఓకే! కానీ, సంక్షేమ పథకాల గురించి మాట్లాడం కాస్త అతి అనిపిస్తోంది కదా! అంతేకాదు, రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్థావించకుండా… ఇంకా కావాలన్న అభిప్రాయమే వ్యక్తపరచారు. జేసీ మాట్లాడుతున్నంతసేపూ ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి అర్థం కాలేదు! అలా చూస్తూ.. చిన్నగా నవ్వుతూ ఉండిపోయారు. ఇక, డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేస్తున్న సైగల్ని కూడా జేసీ పట్టించుకోకుండా మాట్లాడేశారు.