ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారో.. తనకు అవసరం అయినప్పుడు మాత్రమే మాట్లాడుతారో కానీ… అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడితే.. ఆ మాటలు సూటిగా ఎవరికి తగులుతాయో చెప్పడం కష్టం. ప్రభుత్వంతో తనకు ఏదైనా పని పడినప్పుడు… బ్లాక్మెయిలింగ్ లాంటి వ్యవహారాలకు కూడా దిగుతారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో.. అనంతపురంలో జేసీ మీడియాను పిలిచి మరీ కొన్ని వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదని తీర్పు చెప్పేశారు. చంద్రబాబుకు పేరు తెచ్చేలా ఎమ్మెల్యేలు ప్రవర్తించడం లేదంటున్నారు.
చంద్రబాబు విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలున్నాయని నేరుగానే చెప్పేశారు. 40 శాతం ఎమ్మెల్యేలను మార్చితే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని… ఎమ్మెల్యేలను మార్చకుండా అలాగే పెడితే దేవుడే దిక్కని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దుల్లో ఇలాంటి వాతావరణమే కొనసాగితే…ఈ సారి కూడా వందశాతం బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. జేసీ ఉన్నట్లు ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటో.. టీడీపీ వర్గాలు సరిగ్గానే అంచనా వేస్తున్నాయి. అనంతపురంలో.. ఆయన టీడీపీ నేతలతో ఏ మాత్రం సఖ్యతగా ఉండటంతో.. సొంత వర్గంలోనూ వారి తీరుపై కొంత మంది అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారినందర్నీ వైసీపీ నేతలు చేరదీస్తున్నారు.
అదే సమయంలో.. ఈ సారి వారసుల్ని రంగంలోకి దించాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమైనా అభ్యంతరం చెప్పారేమోనన్న చర్చ అనంతపురంలో నడుస్తోంది. ఈ సారి.. అన్నదముల్నే పోటీ చేయమని.. చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. జేసీ బ్రదర్స్ మాత్రం ఈ సారికి.. కుమారులకు చాన్సివ్వాలని నిర్ణయించారు. ఓ పైపు పార్టీ నేతలతో గొడవలు..మరో వైపు ఈ తరహా ప్రకటనలతో… జేసీ దివాకర్ రెడ్డి ఏం సాధించాలనుకుంటున్నారో మరి..!