తూచ్.. తాను అన్నది ఆ ఉద్దేశంతో కాదంటూ మాట మార్చేశారు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి! అదేనండీ.. కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటికి దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గాయనీ, విశ్రాంతి అవసరమని పరీక్షించిన వైద్యులు చెప్పారు. అయితే, ఆరోగ్యం క్షీణించినా తన దీక్ష కొనసాగుతుందని సీఎం రమేష్ చెప్పారు. ఈ దీక్ష నేపథ్యంలో జేసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. టీడీపీ వర్గాలు కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రమేష్ దీక్ష అనవసరమనీ, దాని వల్ల ఉక్కూ రాదూ, తుక్కూ రాదూ అంటూ జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రధాని మోడీ ఆంధ్రాకి ఏదీ చెయ్యరని మూడేళ్ల కిందటే సీఎం చంద్రబాబుకు చెప్పాననీ, కానీ తన మాటలు వినలేదనీ, ఇప్పుడు అనుభవమౌతోందని కూడా జేసీ వ్యాఖ్యానించారు. దీంతో జేసీ తీరుపై సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమైంది. పోరాడుతున్న ఎంపీకి మద్దతు ఇవ్వడం పోయి, దీక్షపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి కాదనే ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఇవాళ్ల తూచ్ అనేశారు. సీఎం రమేష్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రమేష్ దీక్ష వల్ల సమస్య అందరికీ తెలుస్తుందని జేసీ అన్నారు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారనీ, కేంద్రం తీరు దున్నపోతు మీద వాన కురుస్తున్నట్టుగా ఉందని చెప్పారు.
ఎంత తీవ్రంగా ప్రయత్నించినా మోడీ స్పందించే పరిస్థితి ఉండదు కాబట్టి, ఆరోగ్యం పాడుచేసుకోవద్దని సీఎం రమేష్ కు చెప్పానని అన్నారు. అంతేతప్ప, దీక్ష చేయడం తప్పు అని తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని ఇవాళ్ల జేసీ అన్నారు. నిజానికి.. దీక్ష అనవసరం అని నిన్ననే తెగేసి చెప్పారు. అలా చెప్పలేదని ఇవాళ్ల అంటున్నారు! తన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోందని ఆయన తెలుసుకున్నారో ఏమో మరి..! అయితే, జేసీ వ్యాఖ్యల్లో ఒక సత్యం ఏంటంటే… ఇప్పుడు ఏం చేసినా స్పందించే పరిస్థితిలో కేంద్రం లేదు. అలాగని ఏమీ చెయ్యకుండా ఉంటే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది కదా! పార్లమెంటులో భాజపా తీరును ప్రశ్నించబట్టే జాతీయ స్థాయిలో ఏపీ సమస్య చర్చనీయమైంది. ఆ తరువాత, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్లనే కదా.. దేశంలో భాజపాయేతర పార్టీలన్నీ టీడీపీకి మద్దతుగా నిలిచాయి. కాబట్టి, కేంద్రం తీరును ఎండగట్టే కార్యక్రమాలు అవసరమే.