ఇంతకీ ఆయన వ్యూహమేంటోగానీ… కాసేపు ఏపీ సీఎం చంద్రబాబును మహాత్ముడు అని మోసేస్తారు. ఆ తరువాత, ఆయనేమైనా మహాత్ముడా అని తిరిగి విమర్శిస్తూ తోసేస్తారు. మొన్నటికి మొన్న పయ్యావుల కేశవ్‌కు త్వరలోనే మంచి పదవి వచ్చేస్తోందన్నారు. తాజాగా… పయ్యావులకు తెలుగుదేశంలో ప్రాధాన్యతే లేదని వ్యాఖ్యానించారు. ఇలా రోజుకో రకమైన ప్రకటనలు చేస్తూ తెలుగుదేశం శ్రేణుల్లో గందరగోళానికి కారణంగా నిలుస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రిపై ఆయన చేసిన కామెంట్ల నేపథ్యంలో అనంతపురం నేతలు మండిపడుతున్నారు. జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా పరోక్షంగా హెచ్చరించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ గందరగోళం చాలదన్నట్టు బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి హడావుడి చేశారు. అన్ని పార్టీల ఎల్పీ కార్యాలయాల్లో కలియదిరిగారు. అక్కడితో ఆగకుండా తనదైన శైలిలో కామెంట్లు కూడా చేశారు!
ముందుగా ఆయన కాంగ్రెస్ ఎల్పీ ఆఫీస్‌కు వెళ్లి జానారెడ్డితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు ఈ ఇద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ‘రాయల తెలంగాణ’ అనే టాపిక్‌ను జేసీ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ గురించి తాను ఎంత చెప్పినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని జేసీ అన్నారు. అనంతపురంతోపాటు కర్నూలును కూడా కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటై ఉంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉండేదన్నారు. ఆ తరువాత, టీడీఎల్పీ ఆఫీస్‌కు వెళ్లారు. 24 గంటలు తిరిగేలోగా మనసు మార్చుకుని చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ని చూసి ప్రజలు ఓటెయ్యలేదని మంగళవారం వ్యాఖ్యానించారు. బుధవారం వచ్చేసరికి.. చంద్రబాబు చాలా నిజాయితీ పరుడని టీడీపీ నేతలతో చెప్పారు. సమర్థవంతుడనీ, ఆయన తప్పుచేయడం తాను చూడలేదని ఆకాశానికి ఎత్తేశారు.
అక్కడి నుంచి టి.ఆర్.ఎస్.ఎల్.పి. ఆఫీస్‌కు వెళ్లి మంత్రి ఈటెల రాజేందర్‌ను కలుసుకున్నారు. ఇక్కడ కూడా రాయల తెలంగాణ గురించి మాట్లాడారు. ఆ రెండు జిల్లాలను తెలంగాణలో కలుపుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని జేసీ అన్నారు. ప్రస్తుతం తమ రెండు జిల్లాలూ కరువుతో బాధపడుతున్నాయనీ, నీటి కోసం అవస్థలు పడుతున్నామని ఈటెల ముందు వాపోయారు.