40 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగిన జేసీ దివాకర్‌రెడ్డి….ఉన్నట్టుండి రాజకీయాలకు బైబై చెప్పారు. ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కొడుకు పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం పార్లమెంట్‌కు పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో జేసీ పవన్‌కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కంచుకోటలాంటి తాడిపత్రిలో… సోదరుడి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. దీంతో జేసీ నిరాశకు గురయ్యారు. 1985, 89, 94, 99, 2003, 2009 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీకి గుడ్ బై చెప్పి…అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తన మార్క్ చూపించారు జేసీ దివాకర్‌రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నా…తెలుగుదేశం పార్టీలో ఉన్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు…సొంత పార్టీ నేతలనే…బహిరంగంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమైనా…కేంద్ర ప్రభుత్వమైనా….తప్పులుంటే మోహమాటం లేకుండా ఎత్తి చూపారు. ఎమైనా జేసీ దివాకర్ రెడ్డి స్టైలే వేరు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూ…అధిష్ఠానం నిర్ణయాలను తప్పుపట్టారు జేసీ దివాకర్‌రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. జేసీ చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి….తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా తయారైంది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా జేసీ తన పంథాను మార్చుకోలేదు. ఎన్నికల ముందు నరేంద్ర మోదీ సర్కార్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కొనియాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లను…నిర్మోహమాటం లేకుండా తప్పుపట్టారు. సుదీర్ఘ కాలం వీడియో కాన్ఫరెన్స్‌లు వద్దని పలు సందర్భంగా బహిరంగంగానే డైరెక్ట్‌గా అప్పటి సీఎం చంద్రబాబుకు సూచించారు.
రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన జేసీ దివాకర్‌రెడ్డి….శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని….విశ్రాంతి తీసుకుంటానని వివరించారు. అందులో భాగంగానే జిల్లా అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మామూలుగా అయితే ఎన్నికలకు ముందు కూడా.. జేసీ తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించారు. అయితే అనంతపురం కార్పొరేటర్‌గా పోటీ చేస్తానన్నారు. మరి త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అలా అయినా పోటీ చేస్తారో లేదో..?