అనంతపురం నేత జేసీ దివాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అనధికార నేతగా ఫీలైపోతున్నారు. ఆనంతపురం జిల్లాకు ఏ పార్టీ నేత వచ్చినా.. వదిలి పెట్టడం లేదు. వెళ్లి కలిసి వస్తున్నారు. ఆదివారం.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వస్తే.. వెళ్లి కలిసి కాస్త పరిచయం పెంచుకుని వచ్చిన ఆయన.. ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనంతపురం పర్యటనకు వస్తే.. పోలోమంటూ వెళ్లి కలిసి వచ్చారు. మోడీని వేనోళ్ల పొగిడారు. మరి బీజేపీలో చేరుతారా అంటే.. ఏదో ఓ కారణం ఉండాలి కాబట్టి.. పీవోకేని స్వాధీనం చేసుకుంటే.. చేరిపోతానని చెప్పేస్తున్నారు.
వేధింపులు అంతకంతకూ పెరుగుతున్న దశలో.. జేసీ దివాకర్ రెడ్డి.. కనీసం.. తనకు ఓ రక్షణ చట్రం ఉందని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో.. బీజేపీపై పొగడ్తలు ప్రారంభించారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత మొదట్లోనే.. బీజేపీలో చేరేవారి జాబితాలో జేసీ పేరు వినిపించింది. కొంత మంది తనతో టచ్లోకి వచ్చారని కానీ.. తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. కొంత మంది అనంతపురం నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. కానీ జేసీ మాత్రం.. టీడీపీలోనే ఉంటానని చెబుతున్నారు.
ఎలా చూసినా.. జేసీ రాజకీయాల నుంచి రిటైరయ్యారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగలేదు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఆయనతో పాటు.. ఆయన సోదరుడు కూడా ఎన్నికల బరి నుంచి వైదొలిగి.. కుమారులకు చాన్సిచ్చారు. కానీ అది రివర్స్ అయింది. వారిద్దరూ ఓడిపోయారు. దాంతో.. వారికి రాజకీయ జీవితంలో మొదటి సారి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఓటమితో పాటు.. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం.. వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. వయసులో ఉన్నప్పుడు.. చేసిన రాజకీయాల్లా.. ఇప్పుడు.. జగన్ వేట నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.