అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం ఎంత బలమైనదో చెప్పాల్సిన పని లేదు. అయితే వారు తమ సంప్రదాయ రాజకీయాలు చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలా ఉంటున్నారు. కాలంతో మారడంలేదు. లౌక్యంగా రాజకీయం చేయడం లేదు. ఫలితంగా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో వారు పడినన్ని ఇబ్బందులు, కేసులు, ఆర్థిక నష్టాలు మరో టీడీపీ నేత పడి ఉండరు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ ను లౌక్యంగా వాడుకుని తమ నష్టాలను భర్తీ చేసుకుని వ్యాపారాలను పునరుద్ధరించుకోవాల్సిన వారు అనవసర ఆవేశాలకు గురై మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆర్టీపీపీకి చెందిన బూడిదను తరలించుకునే విషయంలో ఏర్పడిన వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఘర్షణ పడ్డారు. చివరికి చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన వస్తోంది. అక్కడి బూడిదను తన నియోజవర్గానికి తరలిస్తున్నారు కాబట్టి తన అనుచరుల వాహనాలే పెట్టాలంటారు జేసీ. కానీ తమ దగ్గర బూడిదవి కాబట్టి తమ వాహనాలు పెడతామని ఆదినారాయణ రెడ్డి అంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది కానీ పెద్దవి చేసుకున్నారు.
ఇది కాదు ఇలాంటివి ఐదునెలల కాలంలో చాలా జరిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా డైరక్ట్ గానే మాట్లాడతారు. అది ఆయన ప్రత్యేకత అనుకోవచ్చు. కానీ రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారని తెలిసి కూడా ఆయన అలా మాట్లాడుతూ ఉంటారు. దీని వల్లనే సమస్యలు వస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ హైకమాండ్ కు ఎంతో అభిమానం ఉంది. ఆ విషయాన్ని లోకేష్, చంద్రబాబు ఎన్నో సార్లు తమ మాటల ద్వారా వ్యక్తపరిచారు. ఆయన వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడ్డారని చెప్పుకుంటారు. ఇలాంటి అభిమానాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి లౌక్యమైన రాజకీయాలతో బలోపేతం అయ్యేందుకు ఉపయోగించుకోవాలి కానీ ఇలా అందర్నీ దూరం చేసుకుంటే ఏం ప్రయోజనమన్న ప్రశ్న ఆయన అనుచరులలో కూడా వస్తోంది.