జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎన్టీపీసీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ సరఫరా చేసే విషయంలో ఏర్పడిన వివాదంలో చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణలు అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుని దాని ముందు కూర్చుని ఆయన క్షమాపణలు చెప్పారు. తాను డబ్బుల కోసం ఆ బూడిద కోసం పట్టుబట్టలేదని అది తన ప్రతిష్ట అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఎంత మందిని సంప్రదించినా స్పందన లేదని అందుకే క్షమాపణలు చెబుతున్నానన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయన్నారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గానికి చెందిన లారీలు ఎన్టీపీసీ బూడిదను అల్ట్రాటెక్ కు సరఫరా చేస్తున్నాయి. అయితే తన నియోజకవర్గంలోకి వస్తున్నాయి కాబట్టి తన లారీలే సరఫరా చేయాలని జేసీ పట్టుబట్టారు. అక్కడే వివాదం ఏర్పడింది. చంద్రబాబు ఇరు వర్గాలను పిలిచారు కానీ .. జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన లారీలు అక్కడే ఉండిపోయాయి. సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ తరలింపు ఆగిపోయింది. చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కితగ్గారు. ఈ సందర్భంగా ఆయన తాను డబ్బుల కోసం ఈ పనులు చేయడం లేదని చెప్పుకొచ్చారు.
తమను 1950లోనే మద్రాస్ లో చదివించారని.. తమ ఇంట్లో అన్ని రకాల లగ్జరీ కార్లు ఉన్నాయన్నారు. తనకు ఉన్న నూట ఇరవై బస్సులు తిప్పుకుంటే చాలన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత తమను నానా తిప్పలు పడ్డారని జైలుకు పంపారన్నారు. పొగరుగా ఉండకపోతే తమకు ఈ సమస్యలు వచ్చేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో ఏమైనా పనులు చేయించుకోవాలంటే దానికో పద్దతిగా ఉంటుంది కానీ.. ఇలా దౌర్జన్యం చేస్తే వివాదాలు చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని జేసీ వర్గీయులు, కుటుంబీకులు కూడా ఆయనకు చెబుతున్నారని అంటున్నారు. కానీ ఆయన మాత్రం తన దారిలోనే తాను వెళ్తున్నారు.