తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా డైరక్ట్గానే చేస్తారు. కమిషన్లు వసూలు అయినా. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్లో చాలా రోజులు చికిత్స తీసుకుని ఇటీవలే తాడిపత్రిలో అడుగు పెట్టిన ఆయన కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రిలో ఇసుక వ్యాపారం చేసేవారు , క్లబ్లు నడిపేవారు నియోజకవర్గం అభివృద్ధికి 15 శాతం కమిషన్ ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఇదంతా మీడియా ముందే. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేమిటంటే… ఆ కమిషన్ ఆయన కోసం కాదు.
ఇసుక, లిక్కర్, క్లబ్ వ్యాపారాలు చేసేవారు పదిహేను శాతం ఇస్తే తాను మరో 20 శాతం డబ్బులు కలిపి నియోజకవర్గానికి ఖర్చు పెడతానని ఆయన అంటున్నారు. తనకు ఒక్కపైసా కూడా వద్దని.. కానీ నియోజకవర్గ అభివృద్ధికి కఠినంగా ఉంటానని చెబుతున్నారు. తాడిపత్రి జేసీ బ్రదర్స్ చేతుల్లలో ఉన్నప్పుడు దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచకపోతే జేసీ ప్రభాకర్ ఒప్పుకోరు. అయితే వారి రాజకీయాల కారణంగా తాడిపత్రి అభివృద్ధి గురించి ఎక్కువగా హైలెట్ అవదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. దశాబ్దాల కిందట ప్రారంభించిన ట్రాన్స్ పోర్టు వ్యాపారం ఆగిపోయింది. మైనింగ్ పై దెబ్బకొట్టారు. వారు ఆర్థికంగా నష్టపోయినంత ఎవరూ నష్టపోయి ఉండరు. అయినా ప్రభుత్వం మారనిన తర్వాత వారు మళ్లీ తాము నష్టపోయినదంతా వెనక్కి తెచ్చుకోవాలని అనుకోలేదు. పోయినా వ్యాపారాలను మళ్లీ ప్రారంభించలేదు.