2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడిన నేతల్లో ముఖ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో లెక్కే లేదు. ఆర్థికంగా చితికిపోయేలా చేసేందుకు ప్రయోగించని పన్నాగం లేదు. ఎక్కడో బస్సులు కొంటే.. అవి కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆయనపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరి అమ్మిన వాళ్లను… ఆ వాహనాలను రిజిస్టర్ చేసిన వాళ్లపై చిన్న కేసు లేదు. ఇలా ఆయనపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు . జైళ్లలో నరకం చూపారు.
ఆర్థికంగా ఆయనను తీవ్రంగా నష్టపరిచారు. బస్సులన్నీ ఆగిపోయాయి. ఐదేళ్లుగా మూలనపడటంతో అవి తుప్పుపట్టిపోయాయి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు జరిగిన నష్టానికి . కష్టానికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతున్నారు. ఆయనేమీ తన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయమని కోరడం లేదు. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆయన రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థిక ప్రయోజనాలు చూసుకుని సైలెంట్ అయ్యే లీడర్ కాదు. తనకు జరిగిన పరువు నష్టాన్ని భర్తీ చేయాలనుకునే లీడర్. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిందని ఆయన నేరుగా సీఎం దగ్గరకు పోయి పనులు చేయించుకోవాలని అనుకోవడం లేదు. తాను చట్టపరంగా ఫిర్యాదులు చేస్తున్నానని విచారించి న్యాయం చేయాలంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయం జరగాలన్న డిమాండ్ టీడీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. మరి చట్ట పరమైన మార్గాలో ఆయన చేస్తున్న డిమాండ్లను ఎలా తీర్చుకుంటారో చూడాల్సి ఉంది.