చంద్రబాబు మంచితనంతో చేతులు కట్టేయడం వల్లనే రోడ్లపైన తిరుగుతున్నారని పేర్ని నానితో పాటు వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి కుటుంబసభ్యులపై కేసులు పెడుతున్నారని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ..మీకేనా కుటుంబాలు ఉంది అని ఆయన మండిపడ్డారు. వైసీపీ హయాంలో తనతో పాటు తన భార్యపై పెట్టిన కేసుల వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని తాడిపత్రిలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పేర్ని నాని బ్యాటరీ వీక్ అని.. నీ భాగోతాలన్నీ నాకు తెలుసు అంటూ జేసీ హెచ్చరించారు. నీ కుటుంబం గురించి మాట్లాడితే తలెత్తుకోలేవన్నారు.మహిళల గురించి మాట్లాడే అర్హత లేనే లేదన్నారు. గతంలో చేసినవి అన్నీ మర్చిపోయారా..? జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనం వల్లేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారన్నారు. కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకెళ్లారని నాని జైలుకు వెళ్లక ముందే ఏడుస్తున్నాడన్నారు.
పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా పేర్ని నాని అని విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ కనుసైగ చేస్తే ఎవరూ మిగలరని జేసీ వ్యాఖ్యానించారు. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది మీ సంస్కారం. అప్పుడెందుకు ఆడవాళ్ల జోలికి వెళ్లొద్దు అని మీ నాయకత్వానికి చెప్పలేదని పేర్ని నానిని ప్రశ్నించారు. చంద్రబాబు మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడు. లేకుంటే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చేవారా.. రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతుండేవారా అంటూ జేసీ మండిపడ్డారు. నీలాంటి వారిని వదిలిపెట్టేదే లేదని జేసీ విరుచుకుపడ్డారు.
పేర్ని నాని జగన్ హయాంలో మంత్రి పదవి నుంచి పీకేయక ముందు రవాణా మంత్రిగా ఉండేవారు. ఏ తప్పులు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి జేసీ ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని మూయించేశారు. 120 బస్సులు షెడ్లలో పాడైపోయాయి. ఈ కోపం జేసీకీ తీవ్రంగా ఉంది.