అనంతపురంజిల్లా తెలుగుదేశం పార్టీలో జేసీ బ్రదర్స్ సృష్టిస్తున్న సునామీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా తగ్గడం లేదు. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని.. నేతలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బహిరంగ హెచ్చరికల నోటీసు జారీ చేశారు. అది కేవలం.. జేసీ ప్రభాకర్… జేసీ దివాకర్ రెడ్డిలను దృష్టిలో పెట్టుకుని చేసిందేనన్న అభిప్రాయం టీడీపీలో బలంగా వినిపించింది. జేసీ బ్రదర్స్ ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారన్న ఆరోపణలు రావడమే దీనికి కారణం. అయితే అప్పట్లో సైలెంట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా పుట్టపర్తి నియోజకవర్గానికి వెళ్లి.. అక్కడి మాజీ టీడీపీఎమ్మెల్యే ప్రస్తుత ఇంచార్జ్ పల్లె రఘునాథ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఓ టీడీపీ నేత ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఆయన … పల్లె రఘునాథరెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని తీర్మానించేశారు. అలాంటి వారికి టిక్కెట్లు ఇస్తే టీడీపీ మునిగిపోతుందన్నారు. తన నియోజకవర్గంలో తాను బలవంతుడిని కానని తేలితే తనకూ టిక్కెట్ వద్దని … ఆయనంటున్నారు. జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చాలని ఆయన అంటున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి సేవ్ కార్యకర్త అంటూ జిల్లా వ్యాప్తంగా తిరిగి కార్యకర్తల్లో ధైర్యం నింపుతామని ప్రకటించారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చే్యడమే లక్ష్యంగా పని చేస్తామంటున్నారు. జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు జేసీ బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రబాకర్ చౌదరి, కాలువ శ్రీనివాస్ పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పల్లె రఘునాథరెడ్డిపై చేశారు. ఆయన కూడా జేసీ ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు. పార్టీలో గ్రూపుల్ని పెంచుతున్నారని మండిపడ్డారు. ఈ పంచాయతీని హైకమాండ్ తీర్చకపోతే… అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు తమను తామే మరోసారి ఓడించుకునే పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తోందని ఆ పార్టీ కార్యకర్తలే మథనపడుతున్నారు.