జెసి ప్రభాకర్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. వస్తూ వస్తూనే తమ పార్టీ కి బద్ద శత్రువైన వైయస్సార్ కి మద్దతు పలుకుతూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రులను గాజులు తొడుక్కున్నారా అంటూ నిలబెట్టి కడిగేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవలిి కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు , నేతలు వైయస్ రాజశేఖర రెడ్డి ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతపు నీళ్లను దోచేసిన వైయస్సార్ తమకు ఎప్పటికీ నర రూప రాక్షసుడే అంటూ టీ ఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. అదే విధంగా వైయస్సార్ గజ దొంగ అంటూ ఇతర టీ ఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ నేతల మీద జన సేన పార్టీ నేత ల మీద బూతులు లంకించుకుంటూ ఇంతెత్తున ఎగిరిపడే వైఎస్ఆర్సీపీ నేతలు, ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు టిఆర్ఎస్ నేతల వ్యాఖ్య ల ను తిప్పికొట్టడం లో మాత్రం ఆశ్చర్యకరమైన సంయమనం పాటించారు. ఆ వ్యాఖ్యలను తప్పు పట్టిన ఒకరిద్దరు నేతలు కూడా ఎంతో సున్నితంగా టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ ని తెలంగాణ నేతలు అలా తిట్టడం సరి కాదని ఈ రోజు వ్యాఖ్యానించారు. వైయస్సార్ తనకు ఆప్తుడు అని, ఇష్టమైన నాయకుడని, అలాంటి పెద్ద మనిషి ని పట్టుకొని రాక్షసుడు అని ఎలా అంటారు అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈ రకం గా విమర్శలు చేయడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షాల మీద బూతులు లంకించుకునే ఏపీ మంత్రులు ఇప్పుడు గాజులు తొడుక్కుని కూర్చున్నారా అంటూ ఘాటైన పదజాలం తో తనదైన శైలి లో విరుచుకుపడ్డారు.
వైయస్సార్ కు మద్దతుగా జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం గా మారాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ మంత్రుల తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ కూడా తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను సరైన రీతి లో తిప్పి కొట్ట లేక పోయారు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో చంద్ర బాబు ను ఉద్దేశించి నడి రోడ్డు మీద కాల్చి పారేయండి అని ఘాటైన వ్యాఖ్యలు చేసిన జగన్, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం ఆ స్థాయి లో విరుచుకు పడ లేక పోతున్నారు. తెలుగు దేశం పార్టీ నేతలను జన సేన పార్టీ నేతలను కించపరిచే టప్పుడు బండ బూతులు వాడే కొడాలి నాని, అనిల్ యాదవ్, ద్వారంపూడి చంద్ర శేఖర రెడ్డి వంటి నేతలు సైతం టిఆర్ఎస్ పై స్పందించే టప్పుడు మాత్రం ఆచి తూచి స్పందిస్తున్నారు. జగన్ తో సహా వైఎస్ఆర్ సీపీ నేతలందరికీ తెలంగాణ లోని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న కారణంగానే టిఆర్ఎస్ పార్టీకి చెందిన చోటా మోటా నేతలకు సైతం ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు, నాయకులు భయపడుతున్నారు అన్న అభిప్రాయం దీని వల్ల ప్రజల్లో కలుగుతోంది.
ఏది ఏమైనా ఇటీవలిి కాలంలో తన పై కేసులు పెట్టి వైయస్ జగన్ ప్రభుత్వం తనను ఎంతగానో వేధించినప్పటికీ, వైయస్ జగన్ తండ్రి వైఎస్సార్ కి మద్దతుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం వైఎస్ అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. అదే సమయం లో విపక్షాల మీద వీర ప్రతాపం చూపించి, తెలంగాణ నేతల పై వ్యాఖ్యలు చేయడానికి తోక ముడిచే ఏపీ మంత్రుల, వైఎస్సార్ సిపి నేతల డొల్ల తనాన్ని ప్రభాకరరెడ్డి భలే గా బయటపెట్టాడు అంటూ మరొక వర్గం ఆనంద పడుతోంది. మొత్తం మీద ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఏమిటో జెసి ప్రభాకర్ రెడ్డి చూపించారు అనే అభిప్రాయం వినిపిస్తోంది.