ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కంటే ఎక్కువ వేధింపులు ఎదుర్కొన్న నేతలు ఎవరున్నారు..? ఎవరూ లేరు. అలా వేధింపులు ఉంటాయని భయపడి చాలా మంది ముందే పార్టీ మారిపోయారు. ఓ మాదిరి వేధింపులు ఎదురు కాగానే.. మంత్రులుగా చేసిన శిద్దా రాఘవరావు లాంటి వాళ్లు జంప్ అయ్యారు. మిగిలిన వాళ్లు పార్టీలోనే ఉన్నా… సేఫ్ గేమ్ ఆడుతూ… రాజకీయం చేస్తున్నారు. కానీ.. ప్రభాకర్ రెడ్డి మాత్రం రాజకీయం ఎలా చేయాలో టీడీపీ నేతలకు చూపించారు. చూపిస్తున్నారు. గెలుపు అనేది ఆస్తుల్ని కాపాడుకోవడంలో… పరువు , ప్రతిష్టలనేవి లొంగిపోయి రాజకీయం చేయడంలో ఉండదని.. తాడిపత్రిలో గెలిచి చూపించారు.
స్వయంగా జేసీ ప్రభాకర్ ని పలుమార్లు అరెస్ట్ చేశారు. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ట్రావెల్స్ వ్యాపారాన్ని పూర్తిగా దిగ్బంధించారు. ఇతర వ్యాపారాలనూ దెబ్బకొట్టారు. చివరికి ఆయన ఇంట్లోకి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చొరబడి హంగామా సృష్టించారు. తాడిపత్రిలో నామినేషన్ల సందర్భంగా ఏర్పడిన పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వార్డు నుంచి పోటీ చేయాలనుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయడానికే ఇబ్బందిపడాల్సి వచ్చింది. చివరికి ప్రచారంలోనూ అనేకానేక ఆంక్షలు పెట్టారు. అయితే అన్నింటికీ ప్రభాకర్ రెడ్డి ఎదురొడ్డి నిలిచారు. ఎంత చేసినా వైసీపీ నేతలు ఆయన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేకపోయారు.
ఆయన ధైర్యం… ఆ పార్టీ శ్రేణులకు కూడా మరింత ధైర్యం కల్పించింది. వారు కూడా.. బెదిరింపులకు తలొగ్గకుండా బరిలో నిలిచారు. పోరాడారు. అనుకున్న ఫలితాలను సాధించారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని.. కానీ నేతలే ధైర్యం చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రజల కోసం తాను ఎదురొడ్డి నిలబడతానన్నారు. జేసీ చెప్పింది అక్షరాలా నిజం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించిన నేతలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఒక లీడర్ ధైర్యంగా నిలబడితే ఫలితాలు ఎలా వస్తాయో తాడిపత్రి నిరూపించింది. నేర్చుకోవడానికి టీడీపీ నేతలు రెడీగా ఉంటారా..?