జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన అంతా వెళ్లగక్కారు. తనను.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన గత ఐదేళ్లుగా పడిన బాధల గురించి తెలిసిన ఎవరైనా … ఆయన ఆవేదన అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది దారి తప్పి.. వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటే… వారిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీయాలనుకుంటే ఎన్ని ఘోరమైన అడ్డదారులు తొక్కుతుందో అన్నీ తొక్కి మరీ జేసీ కుటుంబాన్ని వేధించింది. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది.
జేసీ కుటుంబానికి జేసీ ట్రావెల్స్ బిజినెస్ ఉంది. అది ఇప్పటిది కాదా. ఏడు దశాబ్దాల కిందటది. జగన్ వచ్చాక.. ఫస్డ్ ఎయిడ్ బాక్సుల్లేవని చెప్పే చిన్న చిన్న కారణాలతో బస్సులు మొత్తాన్ని నిలిపివేశారు. ఈ కారణంగా కనీసం వంద బస్సులు తాడిపత్రిలో ఉండిపోయాయి. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. బస్సులు పాడైపోయాయి. అవి పోవడం కాదు.. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులు కొన్నారంటూ కేసులు పెట్టారు. మరి అమ్మిన వాళ్లు.. వాటిని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్లు తప్పు చేసినట్లు కాదా.. కొన్నవారే తప్పులు చేశారా ?
ఇవి మచ్చుకు ఒక్కటి మాత్రమే.. జేసీ కుటుంబం ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. మైనింగ్ గనులను కూడా లాక్కున్నారు. వారికి ఉపాధి, వ్యాపారం లేకుండా చేశారు. చివరికి ఆయన ఇంట్లోకి పెద్దారెడ్డి వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుని రెచ్చగొట్టారు. అయినా జేసీ ఎప్పుడూ తగ్గలేదు. తన పోరాటం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. జగన్ అధికారం పోయింది. అయినా తమ ప్రభుత్వ సాయంతో ఏదో మేలు చేసుకోవాలని ఆయన అనుకోవడం లేదు. తన పగను తానే తీర్చుకోవాలనుకుంటున్నారు.
రాజకీయాల్లో జగన్ లాంటి వాళ్లు ఉన్నత పదవులకు వెళ్తే ఇలాంటి పనులే చేస్తారు. ఫలితంగా.. బాధలు అనుభవించిన వాళ్లు.. అంతకు మించి చేయాలనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేయబోతున్నారోనని తాడిపత్రిలో ఆసక్తికరంగా మారింది.