కడప జైల్లో ఉన్న ఖైదీలు 700 మందికి టెస్టులు చేయిస్తే 300 మందికి కోరనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో… టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. జైల్లో తమకు కరోనా అంటింటే కుట్రలు జరిగాయని… ఆయన గతంలో బెయిల్‌పై విడుదలైన తర్వాత మీడియాతో వ్యాఖ్యానించారు. అలా చెప్పిన రోజే ఆయనను ఎస్సీ, ఎస్టీ కేసులో మళ్లీ జైలుకు పంపించారు. ఆ తర్వాత కస్టడీ పేరుతో మరోసారి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. చివరికి ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా అంటించి చంపించే కుట్రలో భాగంగానే.. ఇలా చేస్తున్నారని .. జేసీ వర్గీయులు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు ప్రత్యేకంగా పగ బట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారంటూ… ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు చాలా కాలం బెయిల్ రానివ్వలేదు. తీరా బెయిల్ వచ్చాక.. అనుచరులు ర్యాలీ తీశారని… సీఐపై దుర్భాషలాడారని… సీఐతోనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి మళ్లీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకింది. తమకు కరోనా అంటించే కుట్ర జరుగుతోందని మొదటి నుంచి ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్ వర్గీయుల భయం ఇప్పుడు నిజం అయింది. జైల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన టీడీపీ నేతల్లో… అచ్చెన్నాయుడు కూడా కరోనా సోకింది. ఆయనను హైకోర్టు సూచన మేరకు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకూ ఆయన గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అది కోవిడ్ సెంటర్ కాకపోవడంతో…వేరే ఆస్పత్రికి తరలించాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో ఆయనను ఎన్నారై ఆస్పత్రికి తరలించారు.