ఎస్పీని తిట్టినా.. హెచ్చరించినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చిన్న కేసు పెట్టకపోవడం… చివరికి చిన్న చిన్న విషయపై పెద్ద పెద్ద లేఖలు రాసే పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించకపోవడంతో… ఇలాంటి కేసుల బారిన పడిన వారిలో కోపం తన్నుకు వస్తోంది. పోలీసులు మరీ వెన్నుముక లేకుండా అయిపోయారని అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కోపానికి కారణం… ఆయనపై పోలీసులే స్వయంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. కొన్నాళ్ల కిందట.. ఆయన కడప జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఒకరి అట్రాసిటీ కేసు పెట్టారు. అప్పుడు పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది.
కానీ ఇప్పుడు.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంత దారుణంగా తిట్టినా.. పోలీసులెవరూ అవమానంగా ఫీలవలేదు. పోలీస్ అసోసియేషన్ స్పందించలేదు. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు.. ఐపీఎస్లు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని.. ఆయనెవరని ప్రశఅనించారు. సాక్షి పత్రికలో కథలు రాసుకునే సజ్జల చెప్పినట్లుగా ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారని … కథలు రాసేవాడు… పోలీసులను ఆదేశిస్తే మీరెందుకు .. ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు.. అని ప్రశ్నించారు. మీ పరిస్థితి దారుణంగా ఉంది మారాలని సలహా ఇచ్చారు.
ఎస్పీపై చిందులేని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎవరో కాదు..జేసీ ప్రభాకర్ రెడ్డి బావమరిది. ఆయన భార్య సోదరుడే. ఈ విషయం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నాకో న్యాయం…తన నా బావమరిదికో న్యాయం ఏమిటని మండిపడ్డారు. తేడా ఒక్కటే ఉందని అది రాజకీయ పార్టీ జెండాల్లో ఉందన్నారు. ఇంకెంత కాలం సజ్జల చేతుల్లో ఉంటారని.. బయటకు వచ్చి స్వతంత్రంగా పని చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇస్తున్నారు. అయితే.. పోలీసులు ఇలాంటివి పట్టించుకోడం మానేసి చాలా కాలం అయింది.