హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసే ఎంపీ, సీనియర్ నాయకుడు జేసీ దివాకరరెడ్డి ఇవాళ సొంతపార్టీపైనే గురిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాదని, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ, ఎమ్మెల్యేలకూ, ఎంపీలకూ అందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్రానికి అదనంగా ఆర్థికసాయంకోసమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విజయవాడలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి హాజరైన జేసీ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రత్యేకహోదాపై బీజేపీ అధికారంలో లేనప్పుడు ఒకరకంగా, అధికారంలోకొచ్చాక మరో రకంగా మాట్లాడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారశైలి దున్నపోతుమీద వానపడ్డట్లుందని విమర్శించారు. ఇచ్చినమాట నిలబెట్టుకోవాలన్న ఇంగితజ్ఞానంకూడా పాలకులకు లేదని అన్నారు. పవన్ పోరాడితే అనుసరించటానికి తాము సిద్ధమని చెప్పారు. ప్రత్యేకహోదా అంటే ఏమిటో తనకు కూడా తెలియదని అన్నారు. అసలు జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాననుకుంటున్నారా లేక ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నారో అర్థంకావటంలేదు. తెలుగుదేశంలోనే ఉన్నాననే స్పృహ ఉంటే సొంతపార్టీనే ఇబ్బందిలో పెట్టేవిధంగా ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారో ఆయనకే తెలియాలి.