సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోనూ టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడంతో సొంత పార్టీ పెట్టేసుకున్నారు. విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెడెంట్ గా పోటీ చేస్తానని కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు మనసు మార్చుకున్నారు. సొంత పార్టీ ప్రకటించారు. జై భారత్ అని పేరు ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్ని కల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీచేశారు.
ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేసుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణమంగా జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ పర్యటించారు. ఇటీవల ఆయన అన్ని పార్టీను పొగుడుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సొంత పార్టీ పెట్టాలని డిసైడయ్యారు. నిజానికి జేడీ లక్ష్మినారాయణ వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది.
అప్పట్లో సొంత పార్టీ పెడితే ఎంతో కొంత వర్కవుట్ అయ్యేదన్న అభిప్రాయం వినిపించింది. కానీ ఈ మధ్య కాలంలో జేడీ వైసీపీని కూడా పొగడటంతో.. ఆయన ఇమేజ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారు. ఆయన ఈ పార్టీతో రాష్ట్రమంతా అభ్యర్థుల్ని నిలుపుతారా.. లేకపోతే తానొక్కడే.. విశాఖ నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. జేడీ విశాఖలో కాకుండా.. విజయవాడలో పార్టీని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.