సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తానని… శషభిషలు లేకుండా ప్రకటించేశారు. అయితే అంతకంటే ముందు.. తాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతానని.. అందరి సమస్యలను అధ్యయనం చేస్తానని..ఆ తర్వాతే కార్యాచరణ రూపొందించుకంటానని స్పష్టం చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత తొలిసారి ఆయన గుంటూరు జిల్లా బాపట్ల శివారులోని ఓజిలి అనే గ్రామంలో ..రైతు సంబంధింత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. అక్కడ తన ప్రసంగంలో..తాను వ్యవసాయ మంత్రిని అయితే అన్న.. ఊహాగానం కూడా లక్ష్మినారాయణ నోటి వెంట వచ్చింది. దాంతో… సీబీఐ మాజీ జేడీ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చినట్లయింది.
కానీ లక్ష్మినారాయణ ఏం చేద్దామనుకుంటున్నారన్నదానిపై.. రాజకీయవర్గాల్లో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఆయనకు ఉన్న ఇమేజ్ ను బట్టి.. ఇప్పుడు ఉన్న ఏ పార్టీలో చేరినా విమర్శలు రావడం ఖాయం. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో.. అమిత్ షాను తానే నిందితుడిగా తేల్చారు. చార్జిషీట్ కూడా వేశారు. అలాంటిది.. అమిత్ షాతోనే కండువా కప్పించుకోలేరు. పోయి పోయి టీడీపీలో చేరలేరు. అలా చేరితే… తనపై కేసులన్నీ చంద్రబాబే పెట్టించారని.. జగన్ మరింత బలంగా వాదిస్తారు. ఇక వైసీపీ పిలిచి ముఖ్యమంత్రిని చేస్తానన్నా లక్ష్మినారాయణ ఆలోచించరు. జనసేనతో నడుద్దామంటే… పవన్ కల్యాణ్ కు కనీస సిన్సియార్టీ కరవయింది. సీబీఐ మాజీ జేడీ అనుకుంటే చేసే రకం. కానీ పవన్ కల్యాణ్ మాటలతోనే కడుపు నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఇద్దరికీ సరిపడే అవకాశాల్లేవు. మరి సీబీఐ మాజీ జేడీ ఆలోచనలేంటి..?
లక్ష్మినారాయణ.. పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారు. ఆయన అన్ని రకాల సమస్యలపై అధ్యయనం చేయాడనికి హంగూ ఆర్భాటం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి తరహా ఏర్పాట్లు చేసుకున్నా.. ఎక్కడికెళ్లినా ఆయన ప్రసంగాలు తప్ప… వేరే కార్యక్రమాలేవీ ఉండేవి కావు. కానీ లక్ష్మినారాయణ భిన్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో తనకు లభించే ఆదరణను బట్టి… ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
లక్ష్మినారాయణ తన రాజకీయ ఆకాంక్షలపై..తొలి సమావేశంలోనే బయటపడ్డారు. గ్రామాలకు, రైతులకు సేవ చేయాలని ఉందని… అ అవకాశం కల్పించలేదనే… తాను… ఐపీఎస్ ను కూడా వదలుకున్నానని స్పష్టం చెప్పారు.లక్ష్మినారాయణ చెప్పిన ఉదాహరణలు ఏవీ కూడా.. జాతీయ స్థాయివి కావు. ముందుగా గ్రాస్ రూట్ లెవల్లో ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నారు. అంటే.. ఆయన కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారు. ప్రజాజీవితంలోకి లక్ష్మినారాయణ రావడం మాత్రం ఖాయమయింది. మిగతా అంతా తర్వాత తేలుతుంది.