స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను అందరూ కలిసి కామెడీ చేసేస్తున్నారు. అదేదో స్టీల్ ప్లాంట్ అమ్మడానికి .. కొనడానికి వేస్తున్న బిడ్లు అన్నట్లుగా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ప్రారంభిస్తే.. దాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. బిడ్ల వేయాలంటూ రోజూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సెయిల్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేయడమే కాదు.. ఇవాళ స్వయంగా తాను బిడ్ వేసేశారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
స్టీల్ ప్లాంట్ ఈవోఐలో పాల్గొనడానికి ఇవాళే చివరి రోజు. ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన తర్వాత నామినేషన్లు దాఖలు చేసినట్లుగా EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం అయితే నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి. కానీ జేడీ దగ్గరే కాదు ఆయనతో ర్యాలీలో పాల్గొన్నఎవరి వద్ద ముడి సరుకు కానీ.. స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం అవసరమైనంత నగదు కానీ ఉండవు. మరి ఎలా బిడ్డింగ్ దాఖలు చేశారంటే. జేడీ లక్ష్మినారాయణ.. ప్రజల నుంచే నిధులు వసూలు చేస్తామని ప్రకటించారు.
క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని ఆయన చెబుతున్నారు. తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కసారి వందరూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు. మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాలు సేకరణ ప్రారంభిస్తామన్నారు. తొలి మొత్తంగా రూ. 200 విరాళాలు సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి…ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని ఆయన చెబుతున్నారు. కేంద్రం ప్లాంట్ ను క్లీన్ షేవ్ చేయాలని చూస్తే క్లియర్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. మొత్తంగా జేడీ మెల్లగా పక్కా రాజకీయ నేతగా మారిపోతున్నారన్న అభిప్రాయం మాత్రం ఇలాంటి వాటి వల్ల బలంగా వినిపిస్తోంది.