సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ…కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను కలిశారు. సంఘిభావం తెలిపారు. ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నా.. ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు. వివిధ వర్గాల సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. రెండు నెలల్లో సమస్యలపై అధ్యయనం పూర్తి చేసి..తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే లక్ష్మినారాయణపై తరచూ ఫలానా పార్టీలో చేరబోతున్నారంటూ రూమర్లు వస్తూంటాయి. దానికి కారణం..ఆయన అన్ని పార్టీల నేతలను ఏదో ఓ సందర్భంలో కలవడమే.
కొద్ది రోజుల కిందట లక్ష్మినారయణ.. పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఆ సమయంలో రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సమావేశమయ్యారు. స్నేహపూర్వక భేటీనేనని చెప్పారు. అంతకు ముందు తిరుపతిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను మీడియా అడిగిన ప్రశ్నకు కన్ఫ్యూజ్ కు గురయి… చెప్పిన సమాధానంతో… సీబీఐ మాజీ జేడీ కూడా బీజేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై చంద్రబాబు కూడా స్పందించడం వివాదాస్పదమయింది. ఇక ఏ జిల్లాకు వెళ్లినా.. లక్ష్మినారాయణ ఓ పద్దతి ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఎక్కడా తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలను సమర్థించడం, విమర్శించడం చేయడం లేదు. ప్రభుత్వానికి ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడినట్లయితే..టీడీపీలో చేరబోతున్నారని.. కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే..బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే .. తన రాజకీయ ప్రవేశంపై .. సీబీఐ జేడీ .. ఎవరి ఊహాగానాలపైనైనా స్పందించడానికి నిరాకరిస్తున్నారు.
ఏ విధంగా చూసినా లక్ష్మినారాయణ… పూర్తిగా పొలిటికల్ మైండ్ తో మాత్రం వెళ్లడం లేదు. సమస్యల పరిశీలనకు బాధితుల వద్దకు వెళ్లినప్పుడు కూడా ఆయన స్పందనలు అలాగే ఉంటున్నాయి. పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించినప్పుడు… తమకు సరైన పరిహారం అందలేని ఓ గ్రామవాసులు సీబీఐ జేడీ దృష్టికి తీసుకెళ్లారు. సహజంగా..జగన్, పవన్ లాంటి రాజకీయ నేతలైతే… ప్రభుత్వంపై నిందలేసి..మనమొచ్చాకా న్యాయం చేసుకుందామంటారు. కానీ.. సీబీఐ జేడీ మాత్రం నిబంధనలు పరిశీలించిన తర్వాత.. మాట్లాడుకుందామని నేరుగా నే చెప్పేశారు. సీబీఐ మాజీ జేడీ ఇప్పుడు … సీఎం రమేష్ ను పరామర్శించి సంఘిభావం తెలిపారు.. కనుక.. ఆయన టీడీపీలోకి వెళ్తారన్న అంచనాలు పెరిగిపోవచ్చు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరగొచ్చు. కానీ అసలు లక్ష్మినారాయణ ఆలోచనలేమిటన్నది.. ఆయనకు మాత్రమే తెలుసు.