స్వచ్చంద పదవీ విరమణ చేసి.. ప్రస్తుతానికి జిల్లాల్లో పర్యటిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ… పీపుల్స్ మేనిఫెస్టోను రెడీ చేశారు. అవగాహన కోసం నిర్వహించిన జిల్లాల యాత్రలో గుర్తించిన సమస్యలతో పీపుల్స్ మేనిఫెస్టో రెడీ చేశానని చిత్తూరు జిల్లాలో ప్రకటించారు. వాటిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ, రైతులు కార్మికులు విద్యార్థులతో మమేకమై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు.. సమస్యలు కూడా తెలుసుకున్నానంటున్నారు. నూటయాభై రోజుల పాటు అన్ని జిల్లాల్లో తిరిగానన్నారు. జాయిన్ ఫైర్ డెవలెప్మెంట్ సంస్థ ద్వారా విభిన్న రంగాల వారీగా సమస్యలను ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు.
కులం ,మతం ,మద్యం, డబ్బులు లేని రాజకీయ వ్యవస్థ రూపకల్పన కోసం పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు.రాజకీయ పార్టీలు ప్రజల తో సంబంధం లేకుండా మ్యానిఫెస్టోలు రూపొందిస్తున్నాయని విమర్శించారు. అందుకు భిన్నంగా రాజకీయ పార్టీలకు ప్రజలే తమ అవసరాలను గుర్తించి ప్రజా మేనిఫెస్టోను అందించే విధంగా చైతన్య పరుస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు ఓట్లు అడిగేటప్పుడు గ్రామ సమస్యల పరిష్కారానికి స్టాంపు పేపర్ల పైన హామీలు లిఖితపూర్వకంగా అందించాలని డిమాండ్ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో రీకాల్ సిస్టం అమలు చేయాలన్నారు.
భారతదేశంలో యువత 65 శాతం ఉన్నారని వీరి ద్వారానే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒక ఎమ్మెల్యే 20 నుంచి 40 కోట్ల వరకు ఎన్నికల ఖర్చు పెడుతున్నారు దీనిని నియంత్రించాల్సి ఉందన్నారు. ఉగ్రవాదం కన్నా అవినీతి ప్రమాదకరం అని ,అవినీతిపై యువత పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మినారాయణ చాలా ఆదర్శాలు చెబుతున్నారు కానీ.. అవన్ని ఆచరణ సాధ్యమో కాదో కానీ.. ఆయన మాత్రం.. రాజకీయ ప్రవేశం ద్వారానే వీటిని సాధించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తను సిద్ధం చేసిన నివేదికలతో సీఎంను కలిసిన తర్వాత.. లక్ష్మినారాయణ రాజకీయ రంగ ప్రవేశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.