పవన్ కల్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా ప్రకటించారు. పవన్ కల్యాణ్ నిలకడ లేని నిర్ణయాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక సినిమాల్లో నటించబోనని… పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారని..దీని వల్ల ఆయనకు నిలకడ లేదని తెలుస్తోందన్నారు. విశాఖలో తనతో పాటు నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ముగిసినప్పటి నుండి వీవీ లక్ష్మినారాయణను.. జనసేన కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు పవన్ కల్యాణ్. ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత కూడా కల్పించలేదు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయన తర్వాత చాలా రోజుల పాటు.. విశాఖలో జనసేన పార్టీ తరపున చురుకుగా పాల్గొన్నారు.
అయితే ఆ తర్వాత పార్టీ తరపున కార్యకలాపాలు లేకపోవడం.. ఒంటరిగా రాజకీయం చేయడం కష్టమని అనుకున్నారేమో కానీ.. తన స్వచ్చంద సంస్థ తరపున కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ కూడా.. వీవీ లక్ష్మినారాయణ ఉంటే ఉన్నారు లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరించారు. పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయనకు ఆహ్వానం పంపలేదన్న ప్రచారం ఉంది. పవన్ పట్టించుకోకపోతూండటంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం చాలా కాలంగా సాగింది. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీ కావడంతో.. ఆ కారణం చూపి… వీవీ లక్ష్మినారాయణ గుడ్ బై కొట్టినట్లుగా తెలుస్తోంది.
ఇతర రాజకీయ పార్టీల్లో చేరుతారో లేదో ఎలాంటి సంకేతాలు.. వీవీ లక్ష్మినారాయణ ఇవ్వలేదు. రాజకీయాలపై ఆసక్తితో.. ముందుగానే ఐపీఎస్‌కు రిటైర్మెంట్ తీసుకున్న వీవీ లక్ష్మినారాయణ సరైన అడుగులు వేయడంలో విఫలమయ్యారు. మొదట సొంత పార్టీ అని.. తర్వాత.. వివిద పార్టీల్లో చేరుతారని ప్రచారం జరిగింది. చివరికి.. జనసేనలో చేరి.. విశాఖ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.