సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సొంత పార్టీ అయినా పెట్టుకుని విశాఖ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. గతంలో తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని కానీ ఏ పార్టీ అన్నది ఎన్నికలకు ముందు చెబుతానన్నారు. తర్వాత రాను రాను ఆయనకు ఏ పార్టీలోనూ అవకాశం ఉన్నట్లుగా కనిపించడం లేదు. కొన్నింటిని ఆయన వద్దనకుుంటున్నారు. మరికొన్ని ఆయనను వద్దనుకుంటున్నాయి. అందుకే జేడీ లక్ష్మినారాయణకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే మిగిలింది. అయితే సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేయాలని అనుకుంటున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్ని నేర్చుకోవడంతో తడబడిపోయారు. తోటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జేడీ లాగే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక స్టాండ్ మీద నిలబడ్డారు. బీఎస్పీ బాధ్యతలు తీసుకుని విస్తృతంగా శ్రమించారు. రిజర్వుడు సీటులో పోటీ చేసే చాన్స్ ఉన్నా జనరల్ సీటు సిర్పూర్ లో పోటీ చేశారు. తమతో పొత్తలు పెట్టుకోవాలని ఒక సీటు ఇస్తామని చాలా పార్టీలు ఆశ పెట్టాయి. ప్రవీణ్ కుమార్ ససేమిరా అని రాజీయం చేస్తున్నారు. ఇది ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. కానీ జేడీ లక్ష్మినారాయణ వేసిన తప్పటడుగుల వల్ల పూర్తిగా ఇమేజ్ కోల్పోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నరన్న కారణం చూపి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అన్నిపార్టీలనూ పొగుడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ఏపీ అధ్యక్ష పదవి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కేసీఆర్ నిర్ణయాలను పలుమార్లు ప్రశంసించారు. కానీ తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించారు. ఓ సారి వైసీపీ అధినేత ను కూడా ప్రశంసించారు. దాంతో ఆయన వైసీపీలో కూడా చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్నీ ఆయన ఖండించారు.
టీడీపీలో చేరే విషయంపై ఎప్పుడూ రూమర్స్ రాలేదు కానీ మళ్లీ జనసేనలో చేరుతారన్న చర్చ అయితే జరిగింది. కానీ పవన్ ఆయనను ఆహ్వానించలేదు… ఆయన కూడా పవన్ ను పార్టీలోకి వస్తానని అడగలేదు. ఈ కారణంగా పెండింగ్ పడిపోయింది. చివరిగా ఆయన సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారు.