జేడీ లక్ష్మినారాయణ మనసు భారత రాష్ట్ర సమితి వైపు లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా బీఆర్ఎస్ గురించే ట్వీట్లు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ ను ఇన్వాల్వ్ చేసింది ఆయనే. బిడ్ వేయాలని డిమాండ్ చేశారు.. బిడ్ వేస్తామని ప్రచారం చేసుకున్నప్పుడు అభినందించారు. ఇప్పుడల్లా ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పగానే.. బీఆర్ఎస్కు క్రెడిట్ ఇస్తూ మొదట సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది కూడా ఆయనే. దీంతో ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా అంచనాకు వస్తున్నారు.
ఏపీలోని ఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా చేరడానికి ఆయనకు మనసొప్పదు. మనసు చంపుకుని చేరితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ కూడా పిలవడం లేదు. ఆయన టీడీపీలో చేరితే జగన్ కేసులపై ప్రభావం పడుతుందని వారు పిలవడం లేదు. ఇక జనసేన పార్టీ నుంచి ఆయన అకారణంగా బయటకు వచ్చారు. అందుకే ఆయనను మళ్లీ పార్టీలోకి రావాలని పవన్ పిలవడం లేదు. జేడీ కూడా అడగడం లేదు. అదే సమయంలో ఏపీలో నేతల కోసం వెదుక్కుంటున్న కేసీఆర్ కు జేడీ కనిపించారు. చర్చలు కూడా జరిగాయని స్వయంగా జేడీ కూడా ప్రకటించారు.
ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో తామే కాపాడేశామని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్కు జేడీ అండగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇక విశాఖ పట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలవడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. తాము స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ సభలోనే జేడీ బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందంటున్నారు.