సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకి ముందు నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీలో చేరడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి తిరిగి వెళుతున్నాడు అని, అది తనకు నచ్చలేదని బహిరంగ లేఖ రాసి జనసేన పార్టీ వీడి వెళ్లి పోవడం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మళ్ళీ త్వరలోనే జనసేన గూటికి చేరనున్నాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తు సమయంలో ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న లక్ష్మీనారాయణ ఒకానొక సమయంలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలని కూడా భావించారు. అయితే జనసేన పార్టీ వైజాగ్ ఎంపీ టికెట్ ఖరారు అయిన వేరే వ్యక్తి, టికెట్ ఖరారు అయిన తర్వాత వెళ్లి వైసీపీలో చేరడం, దానికి కౌంటర్ గా అన్నట్లు జనసేన రాత్రికి రాత్రి లక్ష్మీనారాయణను పార్టీలోకి చేర్చుకోవడం తెలిసిందే. ఓట్లు బాగానే పొందుకున్నప్పటికీ 2019 ఎన్నికల లో విజయ తీరాన్ని మాత్రం లక్ష్మీనారాయణ చేరుకోలేకపోయారు. దాంతో ఆయన ఒక చిన్న కారణాన్ని చూపి ఎన్నికలైన తర్వాత పార్టీ వీడి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత
జనసేన బిజెపి ల మధ్య పొత్తు బలపడడం, బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా సోము వీర్రాజు నియామకం, బిజెపి ఇంచార్జ్ సునీల్ దియోధర్ పవన్ కళ్యాణ్ కి అన్ని అంశాల్లో మద్దతుగా నిలవడం వంటి పరిణామాలు ఆయనను పునరాలోచనలో పడ వేసినట్లు తెలుస్తోంది. బిజెపి జనసేన ల మధ్య అవగాహన లో భాగంగా వచ్చే ఎన్నికలలో వైజాగ్ ఎంపీ టికెట్ మళ్లీ తనకు దక్కుతుందని హామీ ఇస్తే పార్టీలోకి తిరిగి రావడానికి తాను సుముఖంగా ఉన్నానని లక్ష్మీనారాయణ ఫీలర్లు పంపినట్లుగా సమాచారం.
మొత్తానికి తొలి దశ చర్చలు ముగిశాయి అని, లక్ష్మీనారాయణ తిరిగి జనసేన గూటికి చేరనున్నాడని అంతర్గత వర్గాల సమాచారం. ఇది ఏ మేరకు నిజ రూపం దాలుస్తుంది అనేది త్వరలోనే తెలుస్తుంది.