సినిమాలు చేయబోనని చెప్పిన పవన్ మళ్లీ సినిమాలు చేయడంపై అసంతృప్తికి గురై జనసేనకు గుడ్ బై చెప్పిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆదివారం అక్కడ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కార్మికులు, ఉద్యోగులకు సంఘిభావం తెలియచేయనున్నారు. ఈ క్రమంలో మాజీ జేడీ మళ్లీ పవన్ ట్రాక్‌లోకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ నిర్ణయం భారత ప్రభుత్వ ఆలోచనలను మార్పు వచ్చేలా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత వీవీ లక్ష్మినారాయమ స్వచ్చంద సేవ వైపు వెళ్లారు. జేడీ ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను పెట్టి రైతుల కోసం పని చేస్తున్నారు. ఇతర అంశాలపై స్పందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి రాజకీయ పార్టీలు.. రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటూ మద్దతు ప్రకటిస్తే జేడీకి అలాంటి ఇబ్బందులేం లేవు. అందుకే ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పోరాటంలోకి రావడం ఆయనను సంతృప్తి పరుస్తోంది.
వీవీ లక్ష్మినారాయణ మళ్లీ జనసేనలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయనకు రాజకీయాలపై ఇంకా ఆసక్తి ఉందో లేదో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆయితే ఇప్పుడు కాకపోయినా ఎన్నికలు వచ్చే నాటికి ఆయన మళ్లీ జనసేనలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల బరిలో దిగుతారని భావిస్తున్నారు.